మండుటెండలో నిలబడి నిరసన తెలిపిన రాజధాని రైతులు

మండుటెండలో నిలబడి నిరసన తెలిపిన రాజధాని రైతులు

అమరావతి ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. 86వ రోజు నిరసన దీక్షలు, మహాధర్నాలు, ఆందోళనలతో 29 గ్రామాలూ హోరెత్తాయి. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, పెనుమాక, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులోని దీక్షా శిబిరాలు జై అమరావతి నినాదాలతో మార్మోగాయి. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతులు. 86 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నా ఎలాంటి స్పందనా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా మండుటెండలో నిలబడి నిరసన తెలిపారు రైతులు. రాజధాని ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా చేయడంపై ఫైరయ్యారు. ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని నిలదీశారు. ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఎంటో తెలుస్తుందని సవాల్ విసిరారు.

తుళ్లూరులో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ వ్యక్తి మెడలో ముఖ్యమంత్రి అని రాసి ఉన్న ఫ్లకార్డు వేశారు. రైతులంతా అతని చుట్టూ చేరి నిలదీశారు. అమరావతికి ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అమరావతిని కాపాడుకోవడం కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు రైతులు. రాష్ట్ర అభివృద్ధి, 5 కోట్ల మంది ప్రజల కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తారా అంటూ మండిప్డడారు. ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు.

అమరావతి తరలిపోకుండా చూడలంటూ దీక్షా శిబిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రైతులు. శాంతిహోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ మనసు మార్చి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతిని చంపేయొద్దని వేడుకుంటున్నారు రైతులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పలాని సీఎం జగన్‌ను నిలదీశారు.

రాజధాని ఆందోళనలకు ఇతర ప్రాంతల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. వివిధ జిల్లాల నుంచి రాజధాని గ్రామాలకు తరలివస్తున్న జనం రైతుల దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.

Tags

Next Story