చాపకింద నీరులా కమ్ముకొస్తోన్న కరోనా మహమ్మారి

చాపకింద నీరులా కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. ఇప్పటికే మనదేశంలో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. చివరికి కరోనా వైరస్ తొలి మృతి కూడా నమోదైంది. కర్ణాటకలోని కల్బుర్గిలో మొన్న చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ.. కరోనా వైరస్‌తో చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల ఓ ఆసుపత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం.. పుణెకు పంపగా .. రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలింది. అంతకుందు..హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ అతడు చికిత్స పొందాడు. దీంతో... వృద్ధుడి మృతిపై.. తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టామని చెబుతున్నా..వైరస్ వ్యాప్తిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే కొత్త 13 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య 73కి పెరిగింది. ఇందులో 56 మంది భారతీయులు. 17 మంది విదేశీయులు ఉన్నారు. 1500 మంది స్క్రీనింగ్ లో ఉన్నారు. ఏపీలో నెల్లూరు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యాక్తి కరోనా పాజిటీవ్ అని తేలింది. వరంగల్ లోని నీట్ ఓ విద్యార్ధికి కరోనా లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ముంబైలో 2 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహారాష్ట్ర, పుణే, ముంబై, నాగపూర్ తో పాటు కేరళ, యూపీ , తెలంగాణ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, కర్ణాటకల్లో కరోనా వ్యాప్తి కలవరం కలిగిస్తోంది. మొత్తం 12 రాష్ట్రాలకు వైరస్ పాకింది. ఇందులో అత్యధికంగా కేరళాలో 17 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.
కరోనా విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కరోనాను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఎపిడెమిక్ డిసీ జెస్ చట్టంలోని సెక్షన్ రెండును ప్రయోగించాలని రాష్ట్రాలనూ కేంద్రం కోరింది. అలాగే, విదేశాల నుంచి రాకపోకల పై ఆంక్షలు విధించింది. చైనా, ఇరాన్, ఐరోపా దేశాలు, దక్షిణ కొరియాలకు అత్యవసర పనులు ఉంటేనే వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. రానున్న రోజుల్లో కేంద్ర మంత్రులు కూడా విదేశాలకు వెళ్లబోరని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.
కరోనా వ్యాప్తి ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఇరాన్‌లో 6 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారని తెలిపిన జైశంకర్, అక్కడి నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటలీకి కూడా ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతున్నామని తెలిపారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
కరోనా భయంతో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. మార్చి 31 వరకు అన్ని స్కూల్స్, కాలేజీలతో పాటు సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రివాల్ ప్రకటించారు.
జనసమూహం కూడా ప్రాంతాలపై కేంద్రం అంక్షలు విధిస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రపతి భవన్ కు సందర్శకుల పర్యటనను నిలిపివేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్ , చేంజ్ ఆఫ్ గార్డ్ సెర్మనీని కూడా సందర్శనకు అనుమతివ్వబోమని పేర్కొన్నాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఇండియా టూరిజంపై బలంగా పడుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయుల సంఖ్య 70 వేల నుంచి 62 వేలకు పడిపోయింది. విదేశీయులకు వీసాలను రద్దు చేయటంతో ఈ సంఖ్య మున్ముందు భారీగా తగ్గుతుందని కేంద్రం అంచనావేస్తోంది. అలాగే కరోనా భయం టాక్సీవాలాలు, ఆటో డ్రైవర్లను కూడా వెంటాడుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారిని పికప్ చేసుకోవడానికి టాక్సీవాలాలు, ఆటో డ్రైవర్లు ఇష్టపడడం లేదు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com