పంతం నెగ్గించుకున్న వ్లాదిమిర్ పుతిన్

వ్లాదిమిర్ పుతిన్ తన పంతం నెగ్గించుకున్నారు. రష్యా అధ్యక్షుడిగా మరికొన్నేళ్లు కొనసాగడానికి మార్గం సుగమం చేసుకున్నారు. 2036 వరకు రష్యా అధినేతగా పుతిన్ కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దిగువసభ డ్యూమాలో జరిగిన ఓటింగ్‌లో 383 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఆ సవరణలను వ్యతిరేకించలేదు. 43 మంది ఎంపీలు సభకు దూరంగా ఉన్నారు. దిగువసభ ఆమోదించిన కొన్ని గంటల్లోనే ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఈ సవరణలపై రష్యా రాజ్యాంగ న్యాయస్థానం సమీక్షించనుంది. ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరుగుతుంది.
దాదాపు రెండు దశాబ్దాలుగా రష్యాలో పుతిన్ ఆధిపత్యం కొనసాగుతోంది. అధ్యక్షునిగా, ప్రధానిగా, మళ్లీ ప్రెసిడెంట్‌గా పుతిన్ బాధ్యతలు నిర్వహించారు. ముందుగా వరుసగా రెండు దఫాలు అధ్యక్షుడిగా వ్యవహరించిన పుతిన్, రష్యా రాజ్యాంగ నిబంధన ప్రకారం ప్రెసిడెంట్ పోస్టు నుంచి వైదొలిగారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న వెంటనే ప్రధాని పోస్టులో కూర్చున్నారు. ఆ సమయంలోనే దేశ రాజ్యాంగాన్ని సవరించారు. దాంతో మరోసారి అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు. ఇప్పుడు ఏకంగా దేశ శాశ్వత అధ్యక్షునిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com