బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడి చేసిన తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్ల ఘటనలో తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ లభించింది. టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై దాడికి పాల్పడినందుకు.. తురక కిషోర్‌పై హత్యాయత్నం కింద కేసు పెట్టారు పోలీసులు. ఆ దాడిలో పోలీసుల వాహనం కూడా ధ్వంసమైంది. అయితే.. ఒక రోజు వ్యవధిలో తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడం సంచలనంగా మారింది.
మాచర్ల ఘటనలో తురక కిషోర్ సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు నిందితులను గుర్తించామన్నారు గుంటూరు రేంజ్ ఐడీ ప్రభాకర్‌రావు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు యంత్రాంగం సిద్ధంగా ఉందని.. అవాంచనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారాయన. నిందితులపై 324, 509, 149, 188, 143, 147, 148, 341 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తురక కిషోర్ దాడిలో బాధితులు ఎవరూ కేసు పెట్టనందునే తాము స్టెషన్ బెయిల్ ఇచ్చామని పోలీసు అధికారులు వివరణ ఇస్తున్నట్టు సమాచారం. అయితే.. టీడీపీ నాయకులు మాత్రం ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. పబ్లిక్‌గా హత్యాయత్నం చేస్తే.. స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. పల్నాడు నుంచి ప్రాణభయంతో వెళ్లిపోయిన తాము.. విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. కేసు పెట్టలేదనే వాదన సరికాదని అంటున్నారు.
టీడీపీ నాయకుల కిడ్నాప్‌లు, అడ్డొచ్చినవారిపై కర్రలతో దాడులు, గిరిజన మహిళకు కత్తిపోట్లు.. దౌర్జన్యాలకు పరాకాష్టగా మారాయి ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్లు. గుంటూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ నామినేషన్ల ఘట్టం రక్తసిక్తమైంది. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. నేతలనూ వదలకుండా దాడులతో బెంబేలెత్తించారు. పల్నాడులో ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమపై కర్రలతో దాడులు చేశారు. దుడ్డుకర్రతో వాళ్ల కారును ధ్వంసం చేశారు. టీడీపీ నేతలను గాయపరిచారు. మరో కారుపై దాడి చేయడంతో అందులో ఉన్న న్యాయవాదికి సైతం గాయాలయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్ లభించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పోలీసుల వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది.. పబ్లిక్‌గా హత్యాయత్నం చేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. సుమోటోగా కేసు నమోదు చేశామని ఐజీ ప్రభాకర్‌రెడ్డి చెబుతుంటే.. మాచర్ల పోలీసులు మాత్రం కారు అడ్డగింపు, బలమైన గాయం చేయడం, ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. బాధితులెవరూ కంప్లయింట్ చేయలేదని చెబుతున్న పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశామని అన్నారు.. బోండా ఉమ విజయవాడలో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని.. ఆ ఫిర్యాదు కాపీ మాకు అందితే తురక కిషోర్ బెయిల్ రద్దు చేస్తామని మాచర్ల పోలీసులు చెబుతున్నారు.. దీనిపైనా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమోటోగా సాధారణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. హత్యాయత్నం జరిగితే దాన్ని మాత్రం ఎందుకు సుమోటోగా స్వీకరించలేదని ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com