నామినేషన్లు దాఖలు చేయనున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు

నామినేషన్లు దాఖలు చేయనున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. సీనియర్ నేత కేశవరావుకు మరో అవకాశం ఇచ్చారు. ఇక రెండో అభ్యర్థిగా మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌ రెడ్డిని ఎంపిక చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సంఖ్యా బలం రిత్యా... తెలంగాణకు రెండు రాజ్యసభ సీట్లు దక్కాయి. ప్రస్తుతం శాసనసభలో టీఆర్‌ఎస్‌కు ఉన్న బలాబలాలతో ఈ రెండు స్థానాలను ఆ పార్టీ సులభంగా దక్కించుకోనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కేకే, సురేష్‌రెడ్డిలను అభినందించారు. రాజ్యసభకు ఎంపిక చేసినందుకూ ఇద్దరూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు..

సీనియర్ నేత కె. కేశవరావు మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. కేకే రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో ప్రారంభమైంది .విద్యార్థి నాయకుడిగా, ఆ తరువాత పార్టీలో వివిధ కీలక పదవులు నిర్వహించారు. 2005లో పీసీసీ చీఫ్‌గా ఎన్నికై.. మూడేళ్ల పాటు కొనసాగారు. అదే సమయంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేకే కీలకపాత్ర పోషించారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరిన కేకే... ఆ‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి కేసీఆర్‌కు రైట్‌హ్యాండ్‌గా వ్యవహరిస్తున్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి కేకేను రాజ్యసభ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించినప్పుడు కేకే చాలా కీలకంగా వ్యవహరించారు. సీనియార్టీ, పార్టీలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా కేకేకు మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్..

ఇక.. మరో రాజ్యసభసభ్యుడిగా ఎంపికైన మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. బాల్కొండ నుంచి 89, 94, 99, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా పనిచేశారు..అయితే డీలిమిటేషన్‌లో భాగంగా 2009లో ఆర్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు సురేష్ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఆక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు...2018లో TRSలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story