టీవీ5లో వరుస కథనాలు.. మాచర్ల ఘటనలో తురక కిషోర్‌ బెయిల్‌ రద్దయ్యే అవకాశం

టీవీ5లో వరుస కథనాలు.. మాచర్ల ఘటనలో తురక కిషోర్‌ బెయిల్‌ రద్దయ్యే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీసిన మాచర్ల ఘటన నిందితుడు తురక కిషోర్‌కు స్టేషన్‌ బెయిల్‌ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ.. బుధవారం మాచర్ల వెళ్తుండగా.. పట్టపగలు, నడిరోడ్డుపై దాడికి తెగబడ్డాడు తురక కిషోర్. ఈ దాడిలో పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. సాయంత్రానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఐజీ స్వయంగా చెప్పారు. అయితే.. ఒక్క రోజు వ్యవధిలో తురక కిషోర్‌కు స్టేషన్ బెయిల్‌ మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. హత్యాయత్నం కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్‌ ఇవ్వడంపై.. టీవీ5లో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై అటు.. పోలీసు ఉన్నతాధికారులు, ఇటు ఎన్నికల సంఘం అధికారులు దృష్టి పెట్టారు. టీవీ5లో వరుస కథనాలు ప్రసారం అవుతుండడంతో.. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తురక కిషోర్‌కు ఇచ్చిన స్టేషన్‌ బెయిల్‌ రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అతన్ని మరోసారి అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపే దిశగా అడుగులు పడుతున్నాయి.

పబ్లిక్‌గా హత్యాయత్నం చేసిన నిందితుడికి పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీవీ5 కథనాలు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు తెచ్చాయి. పోలీసుల చర్యను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ నాయకులు.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ వేశారు. దీంతో.. పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తురక కిషోర్‌కు ఇచ్చిన స్టేషన్‌ బెయిల్‌ రద్దు చేసి.. రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story