ఆంధ్రప్రదేశ్

దారుణం : 24 జెడ్పీటీసీలు, 563 ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం

దారుణం : 24 జెడ్పీటీసీలు, 563 ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం
X

బెదిరించారు.. భయపెట్టారు.. ప్రలోభపెట్టారు.. చివరకు దౌర్జన్యాలు, దాడులకు ఒడిగట్టారు.. ప్రత్యర్థులకు వున్న అన్ని దారులూ మూసేశారు.. నామినేషన్ల పర్వం ఏకపక్షంగా సాగించి ఏకగ్రీవం చేసుకున్నారు.. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు ఈ ఏకగ్రీవాలే ప్రత్యక్ష నిదర్శనం.. ప్రత్యర్థి పార్టీలపై దాడులు, బెదిరింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిషత్‌ ఎన్నికల్లో ఈరోజు సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో మరికొన్ని స్థానాలు ఏకగ్రీవం అవుతాయన్న ధీమాతో ఉన్నారు అధికార పార్టీ నేతలు.

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్‌, కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది.. అయితే, విపక్ష పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఏకపక్షంగా నామినేషన్లు దాఖలు చేశారు అధికార పార్టీ అభ్యర్థులు. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల పరిధిలో అనేక స్థానాలు అధికార పార్టీ వశం కానున్నాయి.. 24 జెడ్పీటీసీలు, 563 ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.. అయితే, ఇవన్నీ దౌర్జన్యాలతోనే అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాలన్నీ అధికార పార్టీ ఏకగ్రీవంగా సొంతం చేసుకోవడం దౌర్జన్యకాండకు పరాకాష్టగా అభివర్ణిస్తున్నాయి..

కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగింది.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులకు తెగబడ్డ వైసీపీ శ్రేణులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాయి. తమ పార్టీ అభ్యర్థులతో మాత్రమే నామినేషన్లు వేయించి ఏకగ్రీవం చేసుకున్నామంటూ చంకలు గుద్దుకుంటున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా 93 వార్డుల్లో అధికార పార్టీ నామినేషన్లే దాఖలయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుండగా అన్ని వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదంటున్నారు విపక్ష పార్టీల అభ్యర్థులు. బెదిరింపులు, దాడులతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేసేందుకు ముందుకు రానివ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో 31 వార్డులకు గాను 14 చోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించిన ప్రత్యర్థి పార్టీల అభ్యుర్థులపై దాడులకు తెగబడ్డారు.. మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. కొన్ని చోట్ల నామినేషన్‌ పత్రాలను ఎత్తుకుపోవడం, చింపేయడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.. తిరుపతి కార్పొరేషన్‌లోని ఐదు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీ అరాచకాలతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ 32 వార్డులుంటే 12 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, భయపెట్టి, బెదిరించి అధికార పార్టీ మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES