రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు

స్థానిక ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న అరాచకాలపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌.. హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు విపక్షాలపై చేస్తున్న దాడులను, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరును వివరించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను హోం మంత్రికి అందించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తోందని.. పోలీసులు ప్రభుత్వానికే కొమ్ము కాస్తున్నారని ఎంపీలు తమ ఫిర్యాదులో వివరించారు.

తమ ఫిర్యాదుపై హోం మంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎంపీలు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు ఎంపీలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని.. పోలీసులు సైతం నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని.. వారిపై నిఘా ఉంటుందన్న విషయాన్ని మరచిపోవద్దని బీజేపీ ఎంపీలు హెచ్చరించారు.

Tags

Next Story