వైసీపీ దౌర్జన్యాలపై హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన బీజేపీ

వైసీపీ దౌర్జన్యాలపై హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన బీజేపీ

ఏపీలో వైసీపీ దౌర్జన్యాలపై కమలం పార్టీ ఆగ్రహంగా ఉంది. విపక్ష నేతలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌... హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు విపక్షాలపై చేస్తున్న దాడులను, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న తీరును వివరించారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను హోం మంత్రికి అందించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తోందని... పోలీసులు ప్రభుత్వానికే కొమ్ము కాస్తున్నారని ఎంపీలు తమ ఫిర్యాదులో వివరించారు.

ఐతే.. తమ ఫిర్యాదుపై హోం మంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించారని బీజేపీ ఎంపీలు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు ఎంపీలు వెల్లడించారు.

వైసీపీ రౌడీ పార్టీగా వ్యవహరిస్తుందన్నారు ఏపీ బీజేపీ కో ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌. బీజేపీ, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సునీల్‌ దేవధర్‌ అధ్యక్షతన గవర్నర్‌ భిశ్వభూషణ్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు.. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు, నామినేషన్‌ పత్రాలు లాక్కోవడం వంటి ఘటనలపై ఫిర్యాదు చేశారు.

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అధికార పార్టీ వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దీనిపై కేంద్రం, CEC జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గుంటూరు జిల్లా దుర్గి నుంచి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఓ జెడ్పీటీసీ అభ్యర్థి ఫోన్‌ చేసి.. వైసీపీ బెదిరింపులను వివరించారు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే కేసులు బనాయించి లోపల వేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఫోన్‌లో గోడు వెళ్లబోసుకున్నారు.

వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌. దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో దాడులను ఆపాలని.. లేదంటే సహించే పరిస్థితి లేదని బీజేపీ-జనసేన నేతలు వైసీపీకి వార్నింగ్‌ ఇస్తున్నారు.

Tags

Next Story