యూపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌కు మళ్లీ జైలు శిక్ష

యూపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌కు మళ్లీ జైలు శిక్ష

యూపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌కు మళ్లీ జైలు శిక్ష పడింది. ఉన్నావ్ కేసులోనే కుల్దీప్‌కు కారాగార శిక్ష విధించారు. బాధితురాలి తండ్రి హత్య కేసులో కుల్దీప్‌కు పదేళ్ల జైలు శిక్ష వేశారు. అతని సోదరుడు అతుల్ సింగార్‌కు కూడా పదేళ్ల జైలు శిక్ష విధించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్‌ ఇప్పటికే జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు పడింది.

ఉన్నావ్ కేసు 2017లో వెలుగు చూసింది. కుల్దీప్ సెంగార్‌ తనపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడని ఓ యువతి ఆరోపించింది. బాధితురాలు సీఎం కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాధితురాలి తండ్రిని ఆయుధాల చట్టం కింద ఇరికించి జైలుకు పంపించారు. అతను జైలులోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలి తండ్రిది సహజ మరణం కాదని, అతని మృతి వెనక కుల్దీప్ హస్తముందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కేసుపై మూడేళ్లకు పైగా విచారణ జరిగింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు కుల్దీప్ సెంగార్ నేరం చేసినట్లు నిర్దారించి అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

Tags

Next Story