అమరావతిలో ఉదృతమవుతున్న ఉద్యమ సెగలు
అమరావతిలో ఉద్యమ సెగలు ఉద్ధృతం అవుతున్నాయి. రాజధానిని కాపాడుకోవడమే లక్ష్యంగా 29 గ్రామాలు ఒక్కటిగా పోరాడుతున్నాయి. రాజధాని తరలించొద్దన్న నినాదంతో 88 రోజులుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలని, సీఎం జగన్ మనసు మారాలంటూ దేవుళ్లకు మొక్కుతున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, యెర్రబాలెం, తాడికొండ క్రాస్ రోడ్డు, పెదపరిమిలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి.
దాదాపు మూడు నెలలుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మహాధర్నాలు, రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.. దీక్షా శిబిరాలు అమరావతి నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.తమ పోరాటంలో న్యాయం ఉందని, అంతిమ విజయం తమదేనని చెబుతున్నారు. అమరావతి అంటే శ్మశానం కాదు బంగారు భూమి అంటూ నినాదాలు చేస్తున్నారు రైతులు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి ఉద్యమాన్ని చూసి జగన్ సర్కారు భయపడుతోందని ...అందుకే రాజధాని గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేసి పారిపోయిందని విమర్శిస్తున్నారు రైతులు.. ఘోర పరాజయం తప్పదన్న భయంతోనే కుంటిసాకులు చెబుతూ ఎన్నికలను నిలిపివేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామంటున్నారు రైతులు. ఇంత ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
పలుచోట్ల రైతులు 24 గంటల దీక్షలు చేపడుతున్నారు. అటు రైతుల దీక్షలకు విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. అటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలివస్తుత్తున్న జనం సంఘీభావం తెలుపుతున్నారు. ఉద్యమం 88వ రోజుకు చేరినా.. రైతుల్లో, మహిళల్లో పట్టుదల ఏ మాత్రం సడలలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com