పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో మాఫియా కన్ను ప్రకృతి సంపదపై పడింది..

పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో మాఫియా కన్ను ప్రకృతి సంపదపై పడింది. కృష్ణా జిల్లా నందిగామలోని పల్లగిరి కొండను అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వి.. యథేచ్ఛగా దోచేస్తున్నారు. కొంత మంది అధికార వైసీపీ నేతల అండదండలతో నందిగామలో రోజూ వేల టన్నుల మట్టిని ట్రాక్టర్లు, ట్రక్కులలో తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వి... నేషనల్ హైవేకి మట్టిని తరలిస్తూ అడ్డగోలుగా దోచేస్తున్నారు కొందరు కాంట్రాక్టర్లు.

ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు. మాఫియాకు అధికార పార్టీ నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో.. అధికారగణం సైలెంట్‌ అయిపోయింది. సాధారణంగా ఓ కొండను తవ్వాలంటే మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పని సరి. ఐతే.. ఇక్కడ మాత్రం అదేమీ అక్కర్లేదు. అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా కొండను తవ్వి మట్టిని మింగేస్తున్నారు.

మట్టి మాఫియా ఆగడాలపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కొండను పిండి చేస్తూ.. లక్షలు గడిస్తున్న సదరు కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉన్నారు. ప్రకృతి సంపాదనను లూటీ చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా.. స్పందించక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల మేర అక్రమ సంపాదన ఎవరి జేబుల్లోకి వెళుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు లేవు. మట్టి మాఫియాను అడ్డుకోవడంలో అంతులేని అలసత్వం. పైగా.. వారి దోపిడీకి అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తే.. అడపాదడపా విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం.. నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం తప్ప.. ఒరిగేదేమీ లేదనే విమర్శలూ లేకపోలేదు. నందిగామలో మట్టిమాఫియాతో...అధికార పార్టీ నేతలు, సంబంధిత అధికారులు కుమ్మక్కై.. ప్రకృతి సంపాదనను కొల్లగొడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అంటూ డబ్బా కొట్టుకుంటున్న వైసీపీ సర్కార్‌కు నందిగామ మట్టి మాఫియా ఆగడాలు కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పల్లగిరి కొండను కొల్లగొడుతున్న మట్టి మాఫియాకు బ్రేక్ వేస్తారా.. లేదా..? అన్నది చూడాలి.

Tags

Next Story