కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ

కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ

కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులకు తెగబడ్డ వైసీపీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థులతో మాత్రమే నామినేషన్లు వేయించి ఏకగ్రీవంటూ చంకలు గుద్దుకుంటున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 93 వార్డుల్లో అధికార పార్టీ నామినేషన్లే దాఖలయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుండగా అన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ప్రజామ్యం ఖూనీ అయిందనడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదంటున్నారు విపక్ష పార్టీల అభ్యర్థులు. మాచర్లలో వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థుల ముసుగులో వైసీపీ కార్యకర్తలే నామినేషన్లు వేశారు. ఆ తర్వాత ఆ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడం ద్వారా ఆ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చేశారు. అంటే టీడీపీ వాళ్లకు నామినేషన్లు కూడా వేసే అవకాశం లేకుండా చేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు ఆడిన కొత్త తరహా డ్రామా ఇది.

చిత్తూరు జిల్లా పుంగనూరులో 31 వార్డులకు గాను 14 చోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. కొన్ని చోట్ల నామినేషన్‌ పత్రాలను ఎత్తుకుపోవడం, చింపేయడం వంటి ఘటనలు వెలుగు చూశాయి.. తిరుపతి కార్పొరేషన్‌లోని ఐదు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. కర్నూలు జిల్లా డోన్‌లో అధికార పార్టీ అరాచకాలతో టీడీపీ ఎన్నికలను బహిష్కరించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ 32 వార్డులుంటే 12 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, భయపెట్టి, బెదిరించి అధికార పార్టీ మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కడప జిల్లాలో నామినేషన్ల దాఖలు చివరి రోజు టీడీపీ అభ్యర్థులపై ముప్పేట దాడి జరిగింది. మాజీ మార్కెట్‌ ఛైర్మన్‌, టీడీపీ అధికార ప్రతినిధి గాజుల ఖాదర్‌ భాషాపైనా దాడి జరిగింది. ఖాదర్‌భాషా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కలిసి పోలీసులకుఫిర్యాదు చేశారు. అయితే.. తమపై కూడా దాడి జరిగిందంటూ వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

కర్నూల్‌ జిల్లా నంద్యాలలో పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ MPTC అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. భయపడిపోయిన అభ్యర్థులు బీజేపీ నేత అభిరుచి మధు ఇంట్లో తలదాచుకున్నారు. జిల్లాలో పోలీసుల అరాచకాలను... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ, బీజేపీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులను వెనక్కు తీసుకోవాలని బెదిరింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో నగరం మండలం ధూళిపూడి-1 ఎంపీటీసీ అభ్యర్థిని అరుంబాక మల్లీశ్వరి పోలీసులపై ఘాటు విమర్శలుచేశారు. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చారని ఆమె చెప్పారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో టీడీపీ అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించేలా ఒత్తిడి తెస్తున్నారంటూ ఒంగోలు ఆర్డీవోకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. 13 మంది కార్యకర్తలను బైండోవర్‌ పేరుతో తీసుకొచ్చి సీఐ రాజమోహన్‌ గొడ్లను బాదినట్లు బాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎనిమిది చోట్ల సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాత కేసులు ఉన్నావారిని బైండోవర్‌ చేస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో ఇవ్పటివరకు కోటి 84 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చెసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నామని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు రచ్చకెక్కింది. కోట మండలం తిన్నెలపూడిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రను.. మరో వర్గానికి చెందిన నాయకులు కిడ్నాప్‌ చేశారు. నామినేషన్ వెనక్కు తీసుకోకుంటే.. ఫ్యామిలీని సైతం చంపేస్తామంటూ బెదిరించినట్టు చంద్ర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Tags

Next Story