కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు 500 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు 500 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇప్పటికిప్పుడు భయపడే పరిస్థితి లేకున్నా.. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కరోనా వైరస్ కట్టడికి స్వయంగా సీఎం కేసీఆరే యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఇందులో భాగంగా మార్చి 31 వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31లోపు జరిగే పెళ్లిళ్లకే అనుమతి ఉంటుందని.. ఆ తర్వాత పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్స్ ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు 500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మొదటి దశలో వారం రోజుల పాటు జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని రకాల విద్యాసంస్థలను, కోచింగ్ సెంటర్లు, వేసవి శిక్షణ శిబిరాలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఇతర బోర్డు పరీక్షలు, అన్న రకాల ప్రవేశ, పోటీపరీక్షలు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. సంక్షేమ గురుకులాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు వసతి గృహాల్లోనే కొనసాగుతారని చెప్పారు.

ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమైన వారికి 31 వరకు పెళ్లి మండపాలను అనుమతిస్తామని, వాటికి 200 మంది వరకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత అనుమతి ఉండదన్నారు. ఇప్పటికే నిర్ణయమైన ఇతర శుభకార్యాలను కుటుంబ సభ్యుల మధ్యనే నిర్వహించుకోవాలని సూచించారు. సినిమా థియేటర్లు, బార్లు, పబ్‌లు, మెంబర్ షిప్ క్లబ్లులను, ఇండోర్ అవుట్ డోర్ క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ ఫూల్స్ , జిమ్ లు, జిమ్నాజియాలు, జూపార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులు, మ్యూజియాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్ షాపులు, ఉత్సవాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వబోమన్నారు. క్రీడాపోటీలను, కార్యక్రమాలను రద్దు చేస్తున్నామని చెప్పారు.

నిన్న అర్థరాత్రి నుంచే ఈ కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సెలవులు ఇవ్వకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే వాటి అనుమతులను రద్దు చేస్తామన్నారు. మాల్స్ , సూపర్ మార్కెట్లు, మెట్రో, బస్సులు యథాతథంగా తిరుగుతాయన్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్ మార్కెట్లు, మాల్స్ కొనసాగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని, వాటిల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు జరుగుతాయన్నారు.

కరోనా నివారణ చర్యలకు 500 కోట్ల రూపాయలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేటాయించామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ ధ్రువీకరణ లేకుండా ఇష్టం ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రజలు భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇది మన దేశంలో పుట్టిన వ్యాధి కాదని. ఎక్కడో చైనా దేశంలో పుట్టి వ్యాపిస్తోందన్నారు. మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే తప్ప, ఇక్కడ ఉన్నవారెవరికీ వ్యాధి సోకలేదన్నారు. రాష్ట్రంలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించాయని. ఒకరికి చికిత్స సాగుతోందని. మరో ఇద్దరికి పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

వచ్చే నెల 2వ తేదీన శ్రీరామనవమి ఉత్సవాలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై ఇప్పుడేమీ తొందర లేదన్నారు. నెలాఖరు తరువాత పరిస్థితి చూసి ఆలోచించాలని మంత్రివర్గంలో చర్చించామన్నారు. ఉగాది వేడుకలు నిర్వహించాలా వద్దా అనేది కూడా ఆలోచిద్దామన్నారు. జనసమర్ధమైన వేడుకలకు ప్రజలు కూడా దూరంగా ఉంటే మంచిదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story