చైనా, అమెరికాల మధ్య కరోనా యుద్దం

చైనా, అమెరికాల మధ్య కరోనా యుద్దం

ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు దేశాల మధ్య వైరానికి కారణమవుతోంది. ఈ వైరస్ వ్యాప్తితో పలు దేశాలు అల్లల్లాడుతుంటే ... ఈ పాపం మీదంటే, మీదంటూ అగ్రదేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ తొలికేసు చైనాలోని వుహాన్ నగరంలో నిర్ధారణ కావడంతో అది వుహాన్ లోనే పుట్టిదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అక్కడే మరణాలు కూడా అధికసంఖ్యలో నమోదయ్యాయి కూడా. ఈ నేపధ్యంలో వైరస్ చైనాకు రావడానికి అమెరికానే కారణమని చైనా ఆరోపిస్తోంది. అమెరికా ఆర్మీ కరోనా వైరస్ ను తమ దేశానికి తీసుకొచ్చినట్లు చైనా అధికారులు ఆరోపిస్తున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిజియన్ జాహో తన ట్విట్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం పెను సంచలనంగా మారింది.

చైనా -అమెరికాదేశాల మధ్య ఇప్పటికే ట్రేడ్ వార్ కొనసాగుతోంది. దక్షిణ చైనా జలాల అంశంపై ఇరు దేశాధినేతలు పలు మార్లు ఘాటుగానే విమర్శించుకున్నసంగతి తెలిసిందే. చైనా సరిహద్దుదాటి వివిధ దేశాలకు వైరస్ వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కోవిడ్ -19 అనే పేరుపెట్టింది. అయితే అమెరికన్లు మాత్రం ఇప్పటికీ దీనిని చైనా వైరస్ గానే చెపుతున్నారు. అమెరికా అధ్యక్షుడితోపాటు ఉన్నతాధికారులు సైతం దీన్ని వుహాన్ వైరస్, చైనా వైరస్ అంటూ అభివర్ణించడం చైనాకు మింగుడు పడటంలేదు. దీనికి తోడు వైరస్ సోకిన మొదటి వ్యక్తిని గుర్తించడంలో చైనా విషలమైందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ ఆరోపించడం చైనాకు మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ విషయం తేలకముందే ఓ నిర్ణయానికి వచ్చి తమను నిందించడం సరైంది కాదంటోంది చైనా.

చైనా మరో ఒక అడుగు ముందుకేసి అమెరికాపై విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో వ్యాపిస్తున్న వైరస్ ను కట్టడి చేయడంపై అమెరికా దృష్టిపెట్టకుండా.. వైరస్ ఇక్కడ ప్రారంభమైందని నిందలు వేయడం మానుకోవాలని చైనా హితవు పలికింది. అమెరికాలో మొదటికేసు ఎప్పుడు నమోదైంది, ఇప్పటివరకు ఎంతమంది దీనిబారిన పడ్డారు... ఆస్పత్రుల వివరాలు ఏమిటి అనేవాటికి బహిరంగ సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. ఒకవైపు కరోనా వైరస్ చాపకింద నీరుగా వ్యాప్తిస్తూ ప్రాణాలు హరిస్తుంటే.. అమెరికా- చైనాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఏమిటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story