TTD సంచలన నిర్ణయం
కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో TTD సంచలన నిర్ణయం తీసుకుంది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండే పద్ధతికి తాత్కాలికంగా స్వస్తి పలికి వచ్చే ప్రతి భక్తునికి టైంస్లాట్ టోకెన్లు జారీ విధానాన్ని అమలు చేయనున్నామని TTD ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. విశేష పూజ, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలు ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేదీ మార్చుకునే అవకాశం కల్పిస్తామన్నారు. లేదా బ్రేక్ దర్శనానికి వెళ్లే వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలను సెక్టార్‌లుగా విభజించి శుభ్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. గదులు ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శుభ్రం చేసి మరొకరికి కేటాయిస్తామని చెప్పారు ఈవో. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్స కోసం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒంటిమిట్ట ఆలయంలో సీతారాముల కల్యాణం రద్దు చేసి భక్తులకు ఎస్వీబీసీ లైవ్ ద్వారా కల్యాణం వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం నుంచి TTD కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని భక్తులను కోరారు.
కరోనా నివారణార్ధం శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈనెల 19, 20, 21వ తేదీల్లో ఈ యాగం జరుగుతుందన్నారు. అటు.. 7న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని మే నెలకు వాయిదా వేశామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com