90 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం
అమరావతి ఉద్యమం సోమవారంతో 90 రోజులకు చేరింది. ఇన్ని రోజులవుతున్నా... అదే పోరాటం..అదే నినాదంతో అలుపెరగుని పోరాటం చేస్తున్నారు రాజధాని రైతులు. ఏకంగా 3 నెలల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అమరావతిని కాపాడుకోవడమే లక్ష్యంగా 29 గ్రామాలు ఒక్కటిగా పోరాడుతున్నాయి. ప్రభుత్వం దిగి రావాలని, సీఎం జగన్ మనసు మారాలంటూ దేవుళ్లకూ మొక్కుతున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, యెర్రబాలెం, తాడికొండ క్రాస్ రోడ్డు, పెదపరిమిలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి.
మూడు నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని మండిపడుతున్నారు రైతులు. రాజధాని తరలింపును కచ్చితంగా అడ్డుకుంటామని తెగేసి చెబుతున్నారు.
రాజధాని కోసం సుదర్శన యాగం నిర్వహించారు రైతులు..అమరావతి ప్రాంతానికి పట్టిన చీడ, పీడ తొలగిపోవాలని, ముఖ్యమంత్రి జగన్ మనసు మారి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ యాగం చేపట్టారు. మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో ఈ యాగం తలపెట్టారు.
సుదర్శన యాగంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తి తొలగిపోవాలనియాగం చేపట్టడం శుభపరిణామమన్నారు. ఓ వైపు 29 గ్రామాల ప్రజలు అమరావతి కోసం పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులతో 3రాజధానులకు మద్దతుగా ఆందోళనలు జరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com