స్థానిక ఎన్నికల వాయిదా.. గవర్నర్ బిశ్వభూషణ్‌కు సీఎం జగన్ ఫిర్యాదు
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో.. ఏపీలో రాజకీయవేడి తారాస్థాయికి చేరింది. కరోనా వైరస్ కారణంగా.. ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు గవర్నర్‌ను కలవనున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్‌కు వివరిస్తారు. సీఎం జగన్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఎస్‌ఈసీతో గవర్నర్ చర్చించనున్నారు.
సీఎం జగన్ ఆరోపణ నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల వాయిదాపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్నందున కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే.. జాతీయ స్థాయి ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేశామన్నామని స్పష్టం చేశారు ఎస్‌ఈసీ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉపహరించిన తక్షణమే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. అటు.. సీఎం జగన్ ఆరోపణలపైనా స్పందించారు రమేష్‌కుమార్. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరం అని పేర్కొంది.
మరోవైపు.. స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది జగన్ సర్కారు. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఎస్‌ఈసీ నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని పిటీషన్‌లో పేర్కొనుంది. కరోనా వైరస్ ప్రభావంపై హెల్త్ సెక్రటరీతోగాని, చీఫ్ సెక్రటరీతో గాని సమీక్ష, సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టుకు నివేదించనన్నారు. కరోనా లాంటి వ్యాధులను నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని సుప్రీం కోర్టుకు తెలపనుంది ఏపీ సర్కారు.
మరోవైపు.. ఈసీ రమేష్ కుమార్ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. కేంద్రం, సీఈసీకీ ఫిర్యాదు చేయనుంది. రమేష్ కుమార్‌పై పార్టీ పరంగా కాకుండా.. ప్రభుత్వ పరంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. టీడీపీకి అనుకూలంగా రమేష్ కుమార్ వ్యవహరించారంటూ ఆరోపిస్తున్న జగన్ సర్కారు.. కరోనా పేరిట ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది ఏపీ సర్కారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com