కరోనా ప్రభావంతో భక్తుల రద్దీ తగ్గి వెలవెలబోతున్న తిరుమల
కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల కొండ భక్తులు లేక వెలవెలబోతోంది. దీంతో భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కోరానా వ్యాప్తి చెందకుండా టీటీడీ అలెర్ట్ అయింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసిన టీటీడీ.. భక్తులంతా మాస్కులు ధరించాలని సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మంగళవారం నుంచి టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. దీంతోపాటు భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
అలిపిరి వద్ద ధర్మల్ స్క్రీనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే భక్తులను పరిశీలించిన తర్వాతే తిరుమలకు అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. అలిపిరి, శ్రీవారి నడకమార్గంలో టీటీడీ వైద్య శిబిరాలు నెలకొల్పారు. తిరుమలలో ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటు వ్యాధుల నివారణ మందులతో శుభ్రపరిచేలా చర్యలు చేపడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనం, సీఆర్వో కేంద్రాల వద్ద శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అశ్వని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే.. ప్రాథమిక వైద్య సేవల తర్వాత స్విమ్స్‌కు తరలిస్తున్నారు. ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు.. పరిస్థితిని అంచనావేస్తున్నామన్నారు టీటీడీ అదనపు EO ధర్మారెడ్డి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com