మిషన్ భగీరథ ఉన్నా.. బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అతి ముఖ్యమైనది మిషన్ భగీరథ. ఏ మహిళ కూడా చేతిలో బిందెతో బజారులో కనబడకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర పథకం ఇది. అటు అధికార యంత్రాంగం కూడా ఈ పథకం ద్వారా ప్రతి పల్లెలో ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తోంది. అయితే సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. స్థానిక సర్పంచి తీరుతో ఇప్పటికీ సురక్షిత నీరు మాత్రం అందడం లేదు. మిషన్ భగీరథ పైపు లైను వేసినప్పటికి అది పూర్తిగా కంప్లీట్ కాకపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

మహిళలు రోజూ బిందెలు చేత పట్టుకొని చెరువు, వ్యవసాయ బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ పాయింట్ ఉన్నప్పటికీ స్థానిక సర్పంచ్ దానికి తాళం వేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్‌ బంధువుకు చెందిన ప్రైవేట్ ఫిల్టర్ పాయింట్‌కు వెళ్లి డబ్బులు చెల్లించి తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ కుట్రతో విధంగా చేశాడని గ్రామస్తుల విమర్శించారు.

అటు హరిత హారానికి ప్రాధాన్యత ఇస్తూ , ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మొక్కలు నాటిస్తుంటే, ఈ గ్రామంలో మాత్రం.. సర్పంచ్ పెద్ద, పెద్ద చెట్లను నరికి వేయించి తన ప్రైవేట్ స్థలంలో నిలువ చేసుకున్నాడు. ఈ విషయమై ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామస్తులంతా సమిష్టిగా వాడుకుంటున్న స్థలాన్ని సర్పంచ్ సహకారంతో గ్రామంలోని ఓ భూస్వామి ఆక్రమించికున్నాడు. ఇదేమి అని ఆడిగితే తమ మీదనే అక్రమ కేసులు బనాయించి జైలుకు సైతం పంపించాడని గ్రామస్తులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామం లోని నీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న సర్పంచ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story