తెలంగాణలో నాలుగుకి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో నాలుగుకి చేరిన కరోనా కేసులు

తెలంగాణను కరోనా భయపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో నాలుగో పాజిటివ్‌ కేసు నమోదైంది. స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన 46 ఏళ్ల వ్యాపారికి వైరస్‌ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈ నెల 7న హైదరాబాద్‌ నుంచి స్కాట్లాండ్‌ వెళ్లారు. 13న స్కాట్లాండ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. 15న కరోనా‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చిన నలుగురిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఇటలీ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువతి, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన 48 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతున్నారు.

పాజిటివ్‌ లక్షణాలు కనిపించిన ముగ్గురూ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇదే ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మరో 20 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరందరి పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 22 మందిని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత హోటల్‌కు తరలించారు. వీరు చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. హరిత హోటల్‌లో వీరికి ప్రత్యేకంగా గదులు కేటాయించారు. అక్కడ మొత్తం 32 గదులున్నాయని, ఒక కుటుంబం మొత్తం ఒకే గదిలో ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వచ్చిన దాదాపు 107 మందిని గుర్తించే పనిలో అధికారులున్నారు.

చైనాలోని షాంఘై నుంచి ఓ వ్యక్తి.. తన తల్లి చనిపోతే ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. అయితే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతివ్వలేదు. అతడిని పూర్తిగా తమ పరిధిలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కరోనా ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లిందన్న దానిపై అధికారుల్లో అయోమయం నెలకొంది. కొందరు విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లిపోతున్నారు. వీరిద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అందుకే శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారిపైనా నిఘా పెట్టారు.

ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే రూట్లలో, చెక్‌పోస్ట్‌ల దగ్గర ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ధర్మబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ శివారుల్లోని చెక్‌ పోస్ట్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్కారు తెలిపింది. అవసరమైన చోట థర్మల్‌ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గచ్చిబౌలి స్టేడియానికి అనుబంధంగా ఉన్న టవర్లలో 400 గదులు అందుబాటులో ఉన్నాయి. వాటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. అవసరమైతే వాటిని శాశ్వతంగా వైరస్‌ నియంత్రణ ఆస్పత్రిగా మార్చాలన్న ఆలోచనలో సర్కారు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story