ఏపీని వెంటాడుతున్న కరోనా భయం
ఆంధ్ర ప్రదేశ్‌ను కరోనా వెంటాడుతోంది. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు నమోదవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఒకరికి పాజిటివ్ వచ్చినా.. అతడు కోలుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు, కృష్ణ, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖలో కరోనా అనుమానితులు ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఎజెన్సీలో విదేశీయులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు 75 కేసులు నెగిటివ్‌గానే తేలాయని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ కేసులు లేవని వైద్య, ఆరోగ్య శాఖవెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 76 మంది కరోనా అనుమానితులకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు అందాయని.. వాటిలో 75 మందికి కరోనా లేదని తేలినట్టు వివరిణ ఇచ్చింది. ఇప్పటివరకు నెల్లూరులో మాత్రమే పాజిటివ్ కేసు నమోదైందని.. ఆ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేసింది. మరో 13 మందికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది. నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 11 మందిని ప్రత్యేక వార్డుల్లో చేర్చి పరీక్షించగా.. 10 మందికి నెగెటివ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో కరోనా అనుమానితురాలు సోమవారం మృతి చెందారు. అయితే ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా లేదని తేలిందని.. మెదడు వాపు వ్యాధి బారిన పడటంతో ఆమె మృతి చెందిందని వైద్యాధికారులు ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com