గతంలో ఎన్నికలు నిలిచిపోయినా.. కేంద్రం నుంచి నిధులు వచ్చాయి: ఈసీ

గతంలో ఎన్నికలు నిలిచిపోయినా.. కేంద్రం నుంచి నిధులు వచ్చాయి: ఈసీ

జగన్‌ ప్రభుత్వం ఢీ అంటే ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఢీ అంటోంది. స్థానిక ఎన్నికల వాయిదాను CM తీవ్రంగా తప్పుపడితే.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఘాటైన లేఖతో సమాధానం ఇచ్చారు SEC రమేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని రాసిన లేఖకు సమాధానం ఇస్తూ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించడం కుదరనే కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఏమైనా మాట్లాడాలనుకుంటే.. కరోనా ఎఫెక్ట్‌ను తట్టుకునేందుకు ఏం చేయాలనే దానిపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌తో మాట్లాడవచ్చన్నారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ ఎన్నికలు నిర్వహించమని చెబితే ఆరు వారాల్లోగా అంతా పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని SEC రమేష్ కుమార్ స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులకు ఇబ్బంది ఉండబోదని కూడా ఆయన లేఖలో రాశారు. ప్రాథమిక నిధుల విడుదల, పర్ఫామెన్స్‌ గ్రాంట్‌లు వేర్వేరు అంశాలని, తాను గతంలో రాజ్‌భవన్‌లో పనిచేయడానికి ముందు తాను ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని గుర్తు చేశారు. ఎన్నికలు ఆలస్యంగా జరిగిన సందర్భాల్లో కూడా గతంలో కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలున్నాయన్నారు.

ప్రభుత్వం నుంచి మీడియాకు అందిన లీకులపైనా SEC అసహనం లేఖలో కనిపించింది. మీరు నాకు చెప్పాలకున్న విషయాలు మీడియాలో వస్తున్నాయని సీఎస్‌ను ఉద్దేశించి రమేష్‌ కుమార్‌ లేఖలో అన్నారు. అందుకే తాను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో CSకు రాసిన లేఖ మీడియాకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌తోపాటు తనపై జరిగిన దుష్ప్రచారం బాధ కలిగించిందన్నారు రమేష్‌కుమార్‌. రాజ్యాంగబద్ధ సంస్థల ఔన్యత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను లేఖలో చెప్పిన విషయాలను నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంతోపాటు, CSకు నిర్మాణాత్మక సహకారం అందించేందుకు ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంటుందని లేఖలో రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖకు కనీసం తెలియకుండా కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేశారంటూ తనపై నేరుగా CM చేసిన విమర్శలకు రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. మార్చి 14న ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో తాను- సీఎస్‌తో కరోనాపై మాట్లాడానన్నారు. కరోనాపై వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో రెగ్యులర్‌గా టెలిఫోన్‌లో మాట్లాడానని చెప్పుకొచ్చారు. అందుకు తనవైపు నుంచి ఆధారాలు కూడా చూపిస్తానన్నారు.

స్థానిక ఎన్నికల వాయిదాపై CSకు రాసిన లేఖలో ఆర్థిక పరమైన అంశాలపై తన అనుభవాన్ని ప్రస్తావించారు. గతంలో రాజ్‌భవన్‌లో పనిచేయడానికి ముందు తాను ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని గుర్తు చేసిన రమేష్ కుమార్, ఆర్థిక వ్యవహారాలపై తనకు అవగాహన ఉందన్నారు. అలాగే ఈ స్థానిక ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు మెలిక పెట్టొద్దని కూడా సూచించారు. గతంలో కూడా ఎన్నికలు నిలిచిపోయిన సందర్భాల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు తీసుకోవడానికి తమ వంతు సహాయం అందించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు.

Tags

Next Story