ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌

స్థానిక ఎన్నికలు 6 వారాలు వాయిదాపడటాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ సర్కార్. దీనిపై ఇప్పటికే గవర్నర్ వద్ద పంచాయితీ పెట్టిన సీఎం జగన్.. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల వాయిదాను సవాల్‌ చేస్తూ వేసిన ఈ పిటిషన్‌ షెడ్యూల్ ప్రకారం మంగళవారం విచారణకు రావాలి. అయితే కరోనా విజృంభిస్తున్నందుకు.. మంగళవారం సాధారణ కేసుల విచారణలన్నింటిని రద్దు చేసింది సుప్రీం కోర్టు. రివ్యూ పిటిషన్లు, ఛాంబర్‌ మ్యాటర్‌లను కూడా విచారణ చేపట్టబోమని ప్రకటించింది. కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బలపరీక్ష పిటీషన్‌ మాత్రమే ఉంది. ఇందులో ఏపీ సర్కారు పిటీషన్‌ లేదు.

రాష్ట్ర ఎన్నికల సంఘం.. తమకు కనీసం సంప్రదించకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని సీఎం జగన్ మండిపడుతున్నారు. అందుకే ఆగమేఘాలపై సుప్రీం తలుపు తట్టారు. వీలైనంత త్వరగా స్టే తెచ్చుకొని మళ్లీ ఎలక్షన్లు నిర్వహించాలని భావించారు. అయితే మంగళవారం సుప్రీంకోర్టు పిటిషన్లు స్వీకరించకపోవడంతో.. తీర్పు మరింత ఆలస్యం కానుంది.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలిపారు. ఎస్‌ఈసీతోపాటు ఐజీ సత్యనారాయణ కూడా గవర్నర్‌ను కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.

అటు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు. కరోనా వ్యాప్తి లేదని.. పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని లేఖలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.

మరోవైపు ఎన్నికల నిలుపుదలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తక్షణమే ఎలక్షన్లు జరిపించాలన్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీనిపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది హైకోర్టు.

Tags

Next Story