వెనక్కి తగ్గని ప్రభుత్వం.. పట్టు వీడని రైతులు

వెనక్కి తగ్గని ప్రభుత్వం.. పట్టు వీడని రైతులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 90వ రోజూ కొనసాగాయి. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు చేపట్టారు. రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లిలోని శిబిరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. అమరావతితో ఒకే సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందంటూ ప్రభుత్వం దుష్పప్రచారం చేస్తోందని మండిపడ్డారు రైతులు. ముఖ్యమంత్రి జగన్‌ తన అసమర్థతను కప్పి పుచ్చుకోవటానికే అన్నింటికీ కులాన్ని ఆపాదిస్తున్నారని ఆరోపించారు.

91 రోజులుగా రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నాతమ గోడు ఆలకించే నాథుడే లేడని మండిపడుతున్నారు రైతులు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వెనుకడుగు వేసేది లేదంటున్నారు. న్యాయం తమ వైపు ఉందని.. అంతిమ విజయం కూడా తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు రివర్స్‌లో నడుస్తున్నాయని.. తొమ్మిది నెలల్లో తమ బతుకులు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు, మహిళలు. ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. యాగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ మనసు మార్చాలంటూ దేవుళ్లకు మొక్కుతున్నారు.

మొత్తం 29 గ్రామాల్లోనూ వేలాది మంది నిత్యం దీక్షలు, ర్యాలీలు చేస్తున్నా.. ప్రభుత్వానికి పట్టకపోవడం, కనీస మానవత్వం లేకుండా మాట్లాడుతుండడం.. రైతుల్లో పట్టుదలను మరింత పెంచేస్తోంది. అమరావతి కోసం ఎన్నాళ్లైనా ఉద్యమిస్తామని ఈ సర్కారు మెడలు వంచుతామని చెప్తున్నారు.

రాజధాని రైతులకు వివిధ జిల్లాల నుంచి మద్దతు పెరుగుతోంది. జేఏసీతోపాటు పలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదని. రాష్ట్ర భవిష్యత్‌ని భరోసా ఇస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజలతో ఆడుకునే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని నిలదీస్తున్నారు.

Tags

Next Story