తెలంగాణలో మరో కరోనా కేసు.. 6కి చేరిన బాధితుల సంఖ్య

తెలంగాణలో మరో కరోనా కేసు.. 6కి చేరిన బాధితుల సంఖ్య

తెలంగాణను కరోనా వణికిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంటడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో పాజిటివ్‌ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. ఇటీవల లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి శరీరంలో వైరస్‌ వున్నట్లు వైద్యులు గుర్తించారు. రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా.. రిపోర్ట్‌లో పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు ఆరుకు చేరాయి. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అటు మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ఇండోనేషియా నుంచి వచ్చారు. ఇతనితోపాటు మరో 10 మంది సభ్యుల బృందం ఈ నెల 9న రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తించారు. వీరంతా కరీంనగర్‌లో ఉన్నారు. వీరిలో ఒకరికి కరోనా రావడంతో అతనితో కలిసి ఉన్న 10 మందినీ ఐసోలేషన్‌లో పెట్టారు. దీంతోపాటు వారంతా ఎక్కడెక్కడ తిరిగారన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి సారించింది.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకే తప్ప.. ఇంతవరకు తెలంగాణలో ఉన్నవాళ్లెవరికీ కరోనా సోకలేదు. అందుకే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలను మరింత ముమ్మరం చేశారు. నిన్నటి వరకు 2 వేల 57 మందికి స్ర్కీనింగ్‌ చేశారు. వీరిలో 702 మందిని కరోనా అనుమానిత లక్షణాలున్నవారిగా గుర్తించి.. 662 మందిని ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉంచారు. మరో 40 మందిని ఆస్పత్రిలో చేర్చారు. అటు రాష్ట్రంలో మరో నలుగురు అనుమానితులను గుర్తించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఇటలీ నుంచి వచ్చారు. అప్పటినుంచీ జలుబు, దగ్గుతో బాధపడుతూ స్థానికంగా చికిత్స పొందాడు. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు కరోనా అనుమానితులను గుర్తించారు వైద్యులు.

రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్కారు మరింత అప్రమత్తమయింది. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చిన 221 మందిని వికారాబాద్‌ క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. అలాగే యూఏఈకి చెందిన 8 రాష్ట్రాల వారిని కూడా క్వారంటైన్‌లో పెట్టాలన్న యోచనలో సర్కారు ఉంది. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఇక నుంచి నిమ్స్‌లో కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి దాకా నమూనాలను పుణెకు పంపించగా.. కేసుల వివరాలను కేంద్రం ప్రకటించేది. ఇక నుంచి ఇక్కడే రెండోమారు పరీక్షించి పాజిటివ్‌ కేసులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించనుంది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో సరిహద్దును మూసివేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక హైదరాబాద్‌లోని క్వారంటైన్‌ కేంద్రాలు మున్ముందు సరిపోని పక్షంలో జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story