జగన్ సర్కార్ మొండి వైఖరికి బ్రేక్ వేసిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది న్యాయస్థానం. ఎన్నికల సంఘం ఇచ్చిన వాయిదా ఉత్తర్వులను కొట్టేసేందుకు నిరాకరించింది . స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఈసీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. 6 వారాల తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది సుప్రీం కోర్టు. అయితే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. వాయిదా పిటిషన్‌పై ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా వాయిదా ఎలా వేశారని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వివరించింది.
ప్రభుత్వ మొండి వైఖరికి బ్రేక్ వేసింది సుప్రీం కోర్టు. రాజ్యంగ వ్యవస్థనూ గుప్పిట్లో పెట్టుకోనేందుకు చేసిన ప్రయత్నాన్ని నిర్వర్ధంగా తోసిపుచ్చింది. ఓవైపు ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోయింది. దేశంతోపాటు..ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ వ్యవస్థలన్నీ షట్‌డౌన్ అయ్యాయి. ఇవేమీ ఏపీ సర్కారు పట్టలేదు. ఎన్నికల కోసం పట్టుబట్టింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అంతా పూర్తి కావాలని మొండి పట్టుదలకు పోయింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు, పదవులే ముఖ్యం అన్నట్లు వ్యవహరించింది. కరోనా తీవ్రతపై కేంద్ర మార్గదర్శకాలను ఫాలో అయిన SEC రమేష్ కుమార్ ఏపీలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికలు వాయిదా నిర్ణయంతో ముఖ్యమంత్రి జగన్ రగిలిపోయారు. హుటాహుటీన గవర్నర్ దగ్గరకు వెళ్లి పంచాయితీ పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లో ఏ రోజూ ప్రెస్ మీట్ పెట్టని సీఎం...తక్షణమే మీడియా ముందుకు వచ్చారు . కరోనా అంత భయంకరమైన వ్యాధే కాదన్నట్లు మాట్లాడారు. పారాసిటమాల్, బ్లీచింగ్‌తో కంట్రోల్ చేయొచ్చన్నారు..ఇక SEC రమేష్‌కుమార్‌పై నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆయనకు కులాన్ని అంటగట్టారు. అసలు రాష్ట్రానికి నేనా ముఖ్యమంత్రి, ఎన్నికల కమిషనరా అంటూ నిలదీశారు. ఈ మత్రం దానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు అన్నీ ఈసీయే చేసుకోవచ్చుగా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆగమేఘాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించారు...అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో SECపైకి లేఖాస్త్రాన్ని సంధించారు సీఎం.
వ్యవస్థల్ని లెక్క చేయకుండా జగన్ చేసిన ప్రయత్నాలన్నింటికీ ఇప్పుడు బ్రేక్ పడింది. ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాలతో ఎవరి అధికారాలు ఏంటీ అనేదానిపైనా క్లారిటీ వచ్చినట్లైంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన సుప్రీం కోర్టు.. కొత్తపథకాలు చేపట్టాలంటే మాత్రం ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. దీంతో ఉగాది రోజున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం తీర్పుతో ఈ కార్యక్రమానికి లైన్ క్లియర్ అయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ఉచిత పథకం పైగా కొత్త స్కీమ్ కాబట్టి కచ్చితంగా ఈసీ నిర్ణయం తీసుకోవాల్సిందేనని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com