ఏపీలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

ఏపీలో మరో కరోనా పాజిటివ్‌ కేసు

ఏపీలో మరో కరోనా పాజిటివ్‌ కేసు బయటపడింది. ఒంగోలువాసికి కోవిడ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఈ నెల 12న లండన్ నుంచి బయల్దేరిన ఈ వ్యక్తి...15న ఒంగోలుకు చేరుకున్నాడు. జబ్బు, దగ్గు, జ్వరం ఉండటంతో....ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆయన శాంపిల్స్‌ను తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా... పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో మరో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో... ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 105 మంది శాంపిల్స్‌ పరిశీలించగా... అందులో 96 నెగిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి. రెండు పాజిటివ్‌ రాగా... మరో ఏడుగురి రిపోర్ట్‌ రావాల్సి ఉంది. రేపు సాయంత్రానికి మిగిలిన కేసుల రిపోర్ట్‌లు రానున్నాయి.

మరోవైపు.. ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు గురువారం నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు విద్యాలయాలు తెరవకూడదని స్పష్టంచేసింది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే షట్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 160కి చేరింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. అనంతరం.. అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పరిస్థితిని సమీక్షించి.. సెలవుల పొడగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags

Next Story