ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లను సహా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు విద్యాలయాలు తెరవకూడదని స్పష్టంచేసింది.
వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే షట్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. అనంతరం.. అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులో పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికులకు, సిబ్బందికి ధర్మల్ స్కానర్‌ల ద్వారా బాడీ టెంపరేచర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు.. వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోనూ హడలెత్తిస్తోంది. ఇటీవలే విదేశాల నుంచి ఒంగోలు వచ్చిన ఓ యువకుడు గత రెండు రోజులుగా తీవ్ర జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడని గుర్తించిన వైద్య అధికారులు. అతణ్ణి వెంటనే స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. జీజీహెచ్‌తోపాటు ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com