కరీంనగర్‌లో హై అలెర్ట్‌.. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా..

కరీంనగర్‌లో హై అలెర్ట్‌.. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా..
X

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా.. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే 8 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని వైద్యులను , అధికారులను ఆదేశించింది. సరిపడా క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని సూచించింది.‌

అటు కరీంనగర్‌లో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకడంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టరేట్‌ వద్ద ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి బస ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించింది. రహదారిని సహితం మూసివేసారు. 20 ఐసోలేషన్‌, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 100 ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసి కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. ప్రజలు బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.

ఇక విదేశీయులు సందర్శించిన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత ప్రచారం పేరుతో పలువురిని కలిసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడంతో స్థానికుల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. విదేశీయులు ఎంతమందిని కలిసి ఉంటారనే దానిపై ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది. ఒకవేళ కాంటాక్ట్‌ కేసులు పెరిగితే అరికట్టడం కష్ట సాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story