20 March 2020 5:01 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఇటలీలో అల్లకల్లోలం...

ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి

ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి
X

కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య.. 2 లక్షల 50 వేలు దాటింది. మృతుల సంఖ్య 10 వేలపైనే ఉంది... ముఖ్యంగా ఇటలీ అల్లకల్లోలం అవుతోంది. ఇక్కడ కరోనా మృతుల సంఖ్య చైనాను దాటిపోయింది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 3,400 దాటింది. కాగా చైనాలో ఆ సంఖ్య 3,245 వద్ద ఉంది. బుధవారం నాడు ఒక్క ఇటలీలోనే అత్యధికంగా 475 మంది చనిపోయారు. గురువారం మరో 427 మంది మరణించారు. ఇటలీలో వైరస్‌ బాధితుల సంఖ్య 42 వేలకు చేరింది.

ఇరాన్‌లోనూ కరోనా బీభత్సం కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఆ మహమ్మారి ప్రతి 10 నిమిషాలకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటోందని ఇరాన్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్‌లో మృతుల సంఖ్య 13 వందలకు చేరువైంది. బాధితుల సంఖ్య 19 వేలకు చేరువైంది..

కరోనా ప్రభావంతో అర్జెంటీనా లాక్‌ డౌన్‌ అయింది. పౌరులు ఇళ్ల నుంచి బయటికి రావడాన్ని నిషేధించారు. మార్చి ఆఖరు వరకూ ఆహారపదార్థాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అర్జెంటీనాలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. 128 మంది వైరస్‌ బారిన పడ్డారు.

అమెరికాలోనూ కొవిడ్‌-19 తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న దేశాల్లో అమెరికా ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో 200మంది మరణించగా మరో 14వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని అన్నిరాష్ట్రాలకు ఈ వైరస్‌ విస్తరించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని 4కోట్ల జనాభా కలిగిన కాలిఫోర్నియా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేవలం నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 56శాతం మంది ప్రజలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ వెల్లడించారు. అటు ప్రజలను ఆదుకునేందుకు సెనేట్‌ రిపబ్లికన్లు 1 ట్రిలియన్‌ డాలర్లతో ఉద్దీపన చర్యలను ప్రకటించారు.

కరోనా వైరస్‌కు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని చైనా దాచడం మూలంగా ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందిఅని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జూన్‌లో జరగాల్సిన జీ7 దేశాల సదస్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించనున్నట్లు వైట్‌హౌజ్‌ అధికారులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బహిరంగ సమావేశాలను నిషేధించారు. పాఠశాలలు, ప్రజా రవాణా వ్యవస్థను సైతం నిలిపివేశారు. సిడ్నీలో ఉన్న రూబీ ప్రిన్సెస్‌ నౌక నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నౌకలో ఇప్పటికే ప్రయాణించిన వారిని వెంటనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

చైనాలో దేశీయంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. గురువారం 39 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే వాళ్లంతా విదేశాల నుంచి వచ్చినవాళ్లే. చైనాలో విదేశాల నుంచి వచ్చిన కొవిడ్ బాధితుల సంఖ్య 230కి పెరిగింది.

Next Story