ఉరికి ముందు చివరి కోరిక కోరని నిర్భయ దోషులు

ఉరికి ముందు చివరి కోరిక కోరని నిర్భయ దోషులు

వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు అయ్యింది. శుక్రవారం ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులు ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్ లను తీహార్ జైలులో ఉరి తీశారు. ఏడేళ్ల తర్వాత పాపం పండింది. చేసిన కిరాతకానికి తగిన శాస్తి జరిగింది. అయితే.. ఉరిశిక్షకు ముందు నిర్భయ దోషుల్లో పెద్ద పశ్చాతపం ఏమి కనిపించలేదని జైలు అధికారులు చెబుతున్నారు. నిరాశతో జైలులోనే ఓ మూలన కూర్చుండిపోయారు. ముభావంగా ఉండిపోయారు. ఉదయం 3.30 నిమిషాలకు నిద్ర లేచిన తర్వాత ఉరి ప్రక్రియ ప్రారంభం అయ్యింది. స్నానాలు చేసిన తర్వాత వారికి టిఫెన్లు పెట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో నలుగురిని ఐదున్నరకు ఉరితీశారు. నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

నిర్భయ దోషులు ఉరికి ముందు కనీసం చివరి కోరిక కూడా కోరుకోలేదు. ఉదయం ఉరి తీయడానికి ముందు చివరి కోరిక ఏమిటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తిహార్ సెంట్రల్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు. నలుగురు దోషులు స్నానం చేశాక వారికి ఇష్టమైన మతపరమైన పూజలు చేసుకునేందుకు జైలు అధికారులు సమయం ఇచ్చారు. అయితే నలుగురు దోషులు కూడా.. జైలు అధికారులు తమకిష్టమైన దేవుడిని తలుచుకోమని చేసిన సూచనను తిరస్కరించారు. నలుగురు దోషులను ఉరి తీసే ముందు తాము ఎలాంటి పూజలు చేయమని తేల్చి చెప్పారు. అయితే..నిర్భయ కేసులో ఏడేళ్ల న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అవటంతో నిర్భయ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story