నిర్భయ దోషుల చాప్టర్ క్లోజ్

నిర్భయ దోషుల చాప్టర్ క్లోజ్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో.. నలుగురు దోషులను ఎట్టకేలకు ఉరితీశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తిహార్ జైలులో దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సింగ్, పవన్ గుప్తాలకు కట్టదిట్టమైన భద్రత మధ్య ఉరిశిక్ష అమలు చేశారు. తిహార్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ సమక్షంలో.. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు తలారి పవన్ జల్లాద్ దోషులను ఉరి తీశాడు.

ఉరికంబం ఎక్కించే ముందు దోషులకు వైద్యపరీక్షలు నిర్వహించారు అధికారులు. అనంతరం ఉరికంబం వద్దకు తీసుకెళ్లి చివరి కోరిక అడిగారు. ఆ తర్వాత దోషుల డెత్ వారెంట్ పై జిల్లా మెజిస్ట్రేట్ సంతకం చేశారు. అనంతరం నలుగురు దోషులకు సరిగ్గా 5 గంటల 30 నిమిషాలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీసిన తర్వాత.. జైలు నిబంధనల ప్రకారం వారి శరీరాలను ఉరితాడుకు 30 నిమిషాల పాటు అలాగే ఉంచారు. ఆ తర్వాత దోషులంతా చనిపోయినట్లు డాక్టర్ నిర్దారించిన తర్వాత వారి మృతదేహాలను కిందికి దించారు. పోలీసు భద్రత మధ్య దోషుల మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తిచేవారు. ఆ తర్వాత మృతదేహాలను వారివారి కుటుంబసభ్యులకు అందజేశారు.

మొత్తానికి ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి 12 గంటలకు.. 24 ఏళ్ల ఓ పారామెడికల్ విద్యార్థి ఢిల్లీలో తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. ఆ బస్సులోనే యువతిపై పాశవిక చర్యకు పాల్పడ్డారు కామాంధులు. ఏకంగా ఆరుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చలి రాత్రిలో, కదులుతున్న బస్సులో నుంచి ఆమెను నగ్నంగా బయటకు విసిరేశారు. ఆమెతో పాటు అతడి స్నేహితుడిపై కూడా దాడి చేసి రోడ్డుపై పడేశారు.

నడిరోడ్డుపై నిర్భయను, ఆమె స్నేహితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిర్బయ పరిస్థితిని చూసి డాక్టర్లు సైతం చలించిపోయారు. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేయడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. దీంతో నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కూడా తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. డిసెంబర్ 29న నిర్భయ మృతిచెందింది.

నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నిర్భయ దోషులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు నిర్వహించారు. నిందితులకు శిక్షపడాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం వెంటనే నిర్భయ చట్టాన్ని తెచ్చింది. నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అయితే, ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కోర్టు నలుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది.

మిగిలిన మైనర్ బాలుడికి మూడేళ్ల శిక్ష విధించడంతో అది పూర్తి అయిపోయింది. కానీ ఏడేళ్లు గడిచినా నిందితులకు శిక్ష మాత్రం పడలేదు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు చేయని ప్రయత్నాలు లేవు. వంతులవారీగా కోర్టులో పిటిషన్లు వేసి.. బాధిత కుటుంబానికి పరీక్ష పెట్టారు. అయితే, న్యాయస్థానం ముందుకు దోషుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఎట్టకేలకు నలుగురు దోషులు ఉరికంబం ఎక్కక తప్పలేదు.

Tags

Next Story