జనతా కర్ఫ్యూకు సహకరిస్తామంటున్న అమరావతి రైతులు

జనతా కర్ఫ్యూకు సహకరిస్తామంటున్న అమరావతి రైతులు

అదే నినాదం, అదే ఉక్కు సంకల్పం. మొక్కవోని దీక్ష, ఎన్ని అవాంతరాలెదురైనా సడలని పట్టుదల. ఓవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అమరావతి రైతులు. రాజధాని రైతుల ఆందోళనలు 95వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లితో పాటు.. రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, నిరసనలతో దీక్షా శిబిరాలు హోరెత్తుతున్నాయి.

రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ.. 29 గ్రామాలు జై అమరావతి అంటూ నినదిస్తున్నాయి. ఎన్నిరోజులైనా తమ పోరాటం ఆపేది లేదంటున్నారు రైతులు, మహిళలు. రాజధాని తరలింపుపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం చేస్తామంటున్నారు.

అయితే, కరోనాను దృష్టిలో ఉంచుకొని అమరావతి జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపింది. ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని నిర్ణయించారు. రోజూ రాత్రి ఏడున్నరకి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు జేఏసీ నేతలు.

ఓవైపు జనతా కర్ఫ్యూకి పూర్తిస్థాయిలో సహకరిస్తూనే ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంటున్నారు రాజధాని రైతులు. కర్ఫ్యూ సమయానికి ముందు, తర్వాత శిబిరాల్లో గంటపాటు కూర్చోవాలని నిర్ణయించారు. అటు, వందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చిస్తామన్నారు.

పెళ్లి వేడుకలను కూడా దీక్షాల శిబిరాల్లో నిర్వహిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నారు రాజధాని రైతులు. అమరావతిని సాధించే వరకూ పోరాటం ఆగదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మొండివైఖరి వీడాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Next Story