కరోనా వైరస్ మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ
చైనాలోని వుహాన్ మొదలై కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి దెబ్బకు గజగజలాడుతున్నాయి. ఈ వైరస్ భూతాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. జనవరి 22 నాటికి ప్రంపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా 17 మంది మృతి చెందితే, ఫిబ్రవరి 20 నాటికి 2,247 మంది మరణించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 11 వేలకు దాటింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్ష 65వేలకు మించింది.
ఇంతటి కల్లోలం సృష్టిస్తున్న మహమ్మరి చైనాలో తగ్గుముఖం పట్టినా ఇటలీని అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వైరస్ మరణాల్లో ఇటలీ చైనాను దాటేసింది. తాజాగా మరో 427 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఇటలీలోనే చనిపోయిన వారి సంఖ్య 3,405కి చేరింది. వైరస్ బాధితులకు సంఖ్య 42వేలకు దాటింది. అటు చైనాలో తాజాగా 39కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే . చైనాలో వైరస్ వ్యాప్తి చెందినప్పటికి నుంచి ఇప్పటి వరకు 3245 మంది మృతి చెందారు.
చైనాలో పురుడు పోసుకున్న ఈ మహమ్మారి అక్కడ క్రమంగా కనుమరుగవుతోంది. వైరస్ కట్టడికి అలుపెరగని పోరాటం చేయడంతో కాస్త ఉపశమనం కలిగిందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపిందని పేర్కొంటున్నారు. అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఎక్కడిక్కడ అందరినీ నిర్బంధంలో ఉంచింది. మిలియన్ల మందిని ఇళ్లకు పరిమితం చేసి, ప్రజా రవాణాను నిలిపివేసింది. అంటువ్యాధిని త్వరగా తగ్గించడానికి అత్యంత కఠినంగా వ్యవహరించడంతో నెల రోజుల క్రితం రోజుకి వెయ్యి కేసులు నమోదయ్యే చోట ప్రస్తుతం ఒక్క కేసు నమోదు కాలేదు వెల్లడిస్తున్నారు.
కాని ఈ వైరస్ మహమ్మారి ఇటలీలో చాపకింద నీరులా విజృంభిస్తూ మరణమృదంగం మోగిస్తోంది. రోజుకు సగటున 350 మంది మరణిస్తున్నారు. మృతి చెందిన వారిలో చాలా మంది గతంలోనే అనారోగ్యంతో ఉన్నారని అక్కడి వైద్యులు చెబున్నారు. వారంలోనే మరణాల రేటు 150 శాతం పెరిగింది. తొలుత నిర్లక్ష్యం వల్లే ఈ వైరస్ వ్యాప్తికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి మేలుకున్న ఇటలీ ప్రభుత్వం లాక్‌డౌన్ చేపట్టింది. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టింది.
అయితే ప్రస్తుతం చైనా వెల్లడించిన గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ 19 విషయంలో మొదట వాస్తవాలను దాచిపెట్టి, అలసత్వం ప్రదర్శించడంతో వైరస్ విజృంభించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి చైనాయే కారణమని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సహితం విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని దాచిపెట్టడం వల్లే ప్రస్తుతం ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు.
అటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లోలక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ సమయంలో దీని నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలు పరస్పరం సహకారంతో ముందుకువెళ్లాలని సూచించింది . అతి త్వరలోనే ఆఫ్రికాలాంటి పేదదేశాల్లో ఈ మహమ్మారి పాకుతుందని లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరో వైపు అప్పుడే చైనా ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పలేమం టున్నారు నిపుణులు. దేశంలో ట్రావెల్ నిబంధనలు ఎత్తేసి రోజువారీ జీవితాలు యథాస్థితికి వచ్చాక కరోనా మళ్లీ అటాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com