కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్‌లో కొనసాగుతున్న అప్రకటిత కర్ఫ్యూ

కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్‌లో కొనసాగుతున్న అప్రకటిత కర్ఫ్యూ

కరోనా ఎఫెక్ట్ తో కరీంనగర్ పట్ణణంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. గత రెండ్రోజులు స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. మొదటి రోజు 26 వేలమందికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు.. శుక్రవారం మరో 50 వేల మందికి టెస్ట్ లు చేశారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, స్క్రీనింగ్ టెస్ట్ లు కొనసాగుతాయని తెలిపారు. ఈ నెల 31 వరకు కరీంనగర్ మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆరోగ్య నగరంగా మార్చడమే లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వదంతులు నమ్మవద్దని నగరవాసులకు పిలుపునిచ్చారు.

ఇండోనేషియాకు చెందిన 10 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో.. స్క్రీనింగ్‌ టెస్టులు ఉద్దృతం చేశారు. జిల్లాలో 23 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. 11 మందికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో.. హోం క్వారెంటైన్‌ చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చినవారిని గుర్తించామని, వీరి ఎడమ చేయిపై ప్రత్యేక స్టాంప్‌ ముద్రించనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రంలోగా... ప్రక్రియ పూర్తి చేసి.. వారిని గృహాలకు పరిమితం చేస్తామన్నారు.

మరోవైపు శనివారంసీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో వైద్య సిబ్బంది తమ పని తాము చేయడానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యటన వాయిదా వేసినట్లు తెలిపారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి కరోనా సోకినట్లు తేలడంతో.. కరీంనగర్‌లో పరిస్థితి స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే పర్యటించాలని భావించారు. అయితే ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉండటంతో.. పర్యటన శనివారంకి వాయిదా పడింది. కానీ శనివారం కూడా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story