ఏపీలో మోగుతున్న కరోనా డేంజర్ బెల్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 677 మంది గృహ నిర్బంధంలో ఉన్నారు. 104 రిపోర్టులు నెగెటివ్ రాగా.. మూడు పాజిటివ్‌గా తేలింది. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు.. రెండు రోజుల క్రితం 200 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి మలేషియా మీదుగా విశాఖ వచ్చారు. వాళ్లకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా తల్లిదండ్రులతో పంపించడం కలకలం రేపుతోంది.
కరోనా వ్యాప్తి చెందితే నిత్యావసర కొరత వస్తుందన్న ఆందోళన వద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా గురించి ప్రజలు భయపడవద్దని , జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సాకుతో నిత్యావసర ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ కన్వీనర్‌గా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంపైనా కరోనా ప్రభావం పడింది. రాష్ట్రంలో ఇళ్ల పట్టాలను ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగులు, శానిటరీ సిబ్బందిని గుర్తించారు. వీరిలో 31 మందిని రైల్వే ఆస్పత్రికి, ఇద్దరిని CRS ఆస్పత్రిలో ఉంచారు. 10 రోజుల అబ్జర్వేషన్ తర్వాత వీరిని బయటకు పంపుతామని రైల్వే డాక్టర్లు తెలిపారు. ఇండోనేసియా నుంచి కరీంనగర్ వచ్చిన 10 మంది బృందం ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని S-9 బోగీలో ప్రయాణించారు. వీరిందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ బోగీలో ప్రయాణించిన వారితోపాటు రైల్వే సిబ్బందిపైనా అధికారులు ఫోకస్ చేస్తున్నారు. రేణిగుంటలో 33 మందిని గుర్తించిన రైల్వే అధికారులు ఐసోలేషన్ వార్డులో వారిని అబ్జర్వేషన్‌లో పెట్టారు.
అయితే విదేశాలనుంచి వచ్చిన వారిపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టడంలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు విదేశాలనుంచి ప్రకాశం జిల్లాకు 309మంది వస్తే.. 265మంది చిరునామాను మాత్రమే వైద్య సిబ్బంది గుర్తించగలిగారు. మిగిలిన వారు ఎక్కడున్నరన్న సమాచారం వారిదగ్గరలేదు.
కరోనా ఎఫెక్ట్ తిరుమలపైనా పడింది. భక్తులకు ప్రవేశం నిలిపివేయడంతో.. ఎప్పుడు జనసందోహంతో నిండుగా ఉండే.. తిరుమల ఇప్పుడు వెలవెలబోయింది. 128 ఏళ్ల తర్వాత ఏడుకొండలవాడి దర్శనం భక్తులకు నిలిచిపోయింది. లక్షలాది భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగే ఈ కలిగియుగ వైకుంఠం మూగబోయింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనాలకు సైతం బ్రేక్ పడింది. దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. మొక్కులు తీర్చుకునే భక్తులు తమ కార్యక్రమాలను రెండు వారాలపాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ట్రాఫిక్ పోలీసులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. విశాఖ సిరిపురం జంక్షన్‌లో సిగ్నల్స్ వద్ద కరోనా జాగ్రత్త చర్యలను వివరించారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెప్పారు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా కనిపిస్తోంది. ప్రముఖ ఆలయాలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, స్కూళ్లు అన్ని మూతబడ్డాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com