మధ్యప్రదేశ్ రాజకీయ సస్పెన్స్‌కు తెర
మధ్యప్రదేశ్ రాజకీయ సస్పెన్స్‌కు తెరపడింది. రెబల్స్‌ను దారికి తెచ్చుకోవడంలో విఫలమవడంతో.. బల నిరూపణకు ముందే కమల్‌నాథ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. దానికి కొద్ది గంటల ముందు సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి కనిపించకపోవడంతో.. రాజీనామా చేస్తున్నట్టు కమల్‌నాథ్ ప్రకటించారు. అటు కమలనాథులు ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరడం.. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌ను సుప్రీం ఆదేశించిన కొద్దిసేపటికే సింథియా వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ సర్కార్ మైనార్టీలో పడింది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేని స్థితిలో ముందస్తుగానే కమల్ నాథ్ రాజీనామా సమర్పించారు.
కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేతలు సన్నధమవుతున్నారు. శనివారం బిజెపి శాసనసభ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆపార్టీ నుంచి కాబోయే ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహానే అని సూచన ప్రాయంగా తెలుస్తోంది. అటు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రజలను చౌహాన్ కోరారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com