తెలంగాణలో 18కి చేరిన వైరస్ బాధితుల సంఖ్య

తెలంగాణలో 18కి చేరిన వైరస్ బాధితుల సంఖ్య
X

కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 18కి పెరిగింది. అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. ఇందులో ఎవరికీ ప్రాణాపాయం లేదు. అటు విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారా? లేదా? వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులు వాకబు చేస్తున్నారు. సెల్ఫ్ క్వారంటైన్ జరిగిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పాజిటివ్ నమోదైన ఏరియాల్లో ప్రత్యేక రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. అటు ప్రభుత్వం క్వారంటైన్ చేసిన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు..

కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుందన్నారు వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో 6 ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 18 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సీఎం పర్యటనలో పాల్గొననున్నారు. కరీంనగర్‌లో పర్యటించిన తర్వాత అక్కడే సమీక్ష నిర్వహిస్తారు కేసీఆర్. చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై సూచనలు చేయనున్నారు. వాస్తవానికి శుక్రవారమే కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించాల్సి ఉంది.. కానీ ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో శనివారానికి వాయిదా పడింది...

ఆదివారం ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. కరోనా గురించి ప్రజలెవరూ భయపడొద్దని, అప్రమత్తంగా ఉంటే చాలని చెప్పారు. ఆదివారం రాజ్‌భవన్లో జనతా కర్ఫ్యూ పాటిస్తామని చెప్పారు. కరోనాకు స్వీయనియంత్రనే సరైన మందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోందని అన్నారు తమిళిసై.

కరోనా ఎఫెక్ట్‌తో తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా కొనసాగుతుంది.సోమవారం నుంచి జరగాల్సిన అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగాల్సిన ఎగ్జామ్స్‌పై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా ఎఫెక్ట్ తో కరీంనగర్ నిర్మానుష్యంగా మారింది. నగరంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. వ్యాపారస్తుల నుంచి అధికారులకు పెద్దయెత్తున సహకారం అందుతోంది. రెండోరోజు కూడా షాపులు క్లోజ్ చేశారు . తొలి రోజు 26 వేలమందికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు.. శుక్రవారం మరో 26 వేల మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు శారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా పాజిటివ్ రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 31 లోపు కరీంనగర్ మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆరోగ్య కరీంనగర్ గా మార్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు అధికారులు.ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అన్న వివరాలను ఇప్పటికే సేకరించారు.

అమెరికాలో పర్యటించి గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సిర్పూర్ కాగజ్‌ నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సతీమణి.. 14 రోజుల క్వారంటైన్ వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లారు. అంతటితో ఆగకుం జన సమూహంలో తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదస్పదంగా మారింది. దీంతో కోనప్పను క్వారంటైన్ చేయాలని ఆదేశించారు కొమురం భీం జిల్లా కలెక్టర్..

కరోనాను తరిమికొట్టేందుకు ఖమ్మం గుంటిమల్లేశ్వర ఆలయంలో యాగం నిర్వహించారు. వైష్ణవ, శైవ ఆలయాలలో ఈ యాగాలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వివాహ వేడుకలపైనా కరోనావైరస్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లామెట్ పల్లి పట్టణంలో జరిగిన ఓ వేడుకలో బంధువుల సందడే కనిపించలేదు. పెళ్లికూతురు, పెళ్లికొడుక్కి కూడా మాస్కులు వేశారు. పెళ్లిమండపంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

Tags

Next Story