కమల్ నాథ్ రాజీనామపై స్పందించిన మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

కమల్ నాథ్ రాజీనామపై స్పందించిన మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

వారం రోజులుగా కీలక మలుపులు తిరుగుతున్న మధ్యప్రదేశ్ రాజకీయానికి తెరపడింది. బలనిరూపణకు ముందే కమల్ నాథ్‌ అస్త్రసన్యాసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. దానికి కొద్ది గంటల ముందు సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి కనిపించకపోవడంతో.. బలపరీక్షకు ముందే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ కారణంగా సమావేశాలు ప్రారంభమైన రోజే సభను అర్థాంతరంగా వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందనీ.. మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ.. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, బలపరీక్షకు ముందే కమల్ నాథ్ సీఎం కుర్చీ దిగిపోయారు.

ప్రెస్ మీట్ పెట్టి మరీ తన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కమల్ నాథ్. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగళూరులో తమ ఎమ్మెల్యేలను నిర్బంధంలో ఉంచారని ఆరోపించిన ఆయన.. తన సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది.. జనం వాళ్లను క్షమించరని అన్నారు. మధ్యప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని అన్నారు కమల్ నాథ్. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించానని తెలిపారు. 15 ఏళ్లలో చేయలేని పనులను కేవలం 15 నెలల్లో చేసి చూపించానని అన్నారు.

కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరడం.. ఆయనతోపాటు ఆరుగురు మంత్రులు సహా 22 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడంతో.. మధ్యప్రదేశ్ సర్కార్‌ మైనార్టీలో పడింది. అసంతృప్తులను బుజ్జగించి వెనక్కి రప్పించడంలో కమల్ నాథ్ విఫలమయ్యారు. దీంతో మెజారిటీ నిరూపించుకోలేని స్థితిలో ముందస్తుగానే కమల్ నాథ్ రాజీనామా సమర్పించారు.

15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సింధియా కీలక పాత్ర పోషించారు. కానీ స్వల్ప మెజార్టీ రావడంతో ఆయనకు సీఎం పదవి దక్కలేదు. పీసీసీ చీఫ్ పదవి, రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కకుండా కమల్ నాథ్, దిగ్విజయ్ అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆగ్రహంతో సింధియా అదును చూసి బీజేపీలో చేరారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం 92కు పడిపోయింది. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు 104 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో బలపరీక్షకు ముందే కమల్ నాథ్‌ రాజీనామా చేశారు.

కమల్ నాథ్ రాజీనామపై మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ స్వీయ తప్పిదాలే ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు శివరాజ్ సింగ్.

ఇక, కమల్ నాథ్ రాజీనామాతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. శివరాజ్ సింగ్ చౌహాన్, అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత గోపాల్ భార్గవతో పాటు.. బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించారు.

Tags

Read MoreRead Less
Next Story