ప్రపంచవ్యాప్తంగా పట్టు బిగుస్తోన్న కరోనా మహమ్మారి.. 184 దేశాల్లో ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా పట్టు బిగుస్తోన్న కరోనా మహమ్మారి.. 184 దేశాల్లో ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పట్టు బిగుస్తోంది. 184 దేశాలకు వైరస్ విస్తరించింది. ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌ తీవ్రంగా అల్లాడిపోతున్నాయి. అక్కడ నిత్యం వందల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 13 వేలు దాటింది. 3 లక్షల మందికి పైగా బాధితులుగా మారారు. అమెరికా అధ్యక్షుడి వైట్‌హౌస్‌లోకి సైతం కరోనా వైరస్‌ ప్రవేశించడం సంచలనంగా మారింది. US ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ కార్యాలయంలోని ఓ అధికారికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో.. ఆయన భార్యకు సైతం పరీక్షలు చేశారు. ఆమెకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.

కరోనా వైరస్ ప్రభావం తక్కువగా కనిపించిన ఆఫ్రికా ఖండంలోను కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగోలో తొలి మరణం సంభవించింది. అంగోలా, ఎరిత్రియాలో తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు అమలు చేస్తున్నారు. నైజీరియాలో ఎయిర్‌పోర్టులు మూసివశారు. రువాండాలో ప్రజారవాణాను రెండు వారాలు నిషేధించారు.

కరోనా వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరం మాత్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అక్కడ కొత్త కేసులు నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. వైద్య బృందాలు స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యాయి. కరోనా ధాటికి కన్నీరు పెడుతున్న దేశాలకు సాయం అందించేందుకు చైనీయులు ముందుకు వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story