ఆంధ్రప్రదేశ్

సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారిన గంగవరం పోలీస్‌ స్టేషన్

తూర్పుగోదావరి జిల్లా గంగవరం పోలీస్‌ స్టేషన్ సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసులు కూడా నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారు పోలీసులు. పోలవరం ప్రాజెక్టు ఆర్‌ అండ్ ఆర్ కాలనీ గృహ నిర్మాణ పనులకు కోసం ఉంచిన ఐరన్ మెటీరియల్‌ను కొందరు దొంగిలించారు. సమాచరం అందుకున్న గోకవరం పోలీసులు కొత్తపల్లి వద్ద దొంగిలించిన ఐరన్‌తో ఉన్న వాహనంతోపాటు... ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు..అయితే స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో కేసుని గంగవరం స్టేషన్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. పోనీ గంగవరం పోలీసులన్నా కేసు నమోదు చేస్తారా అంటే అదీ జరగలేదు..

వారం గడిచినా కేసు ఎందుకు నమోదు చేయలేదని గంగవరం S.I. షరీఫ్‌ అడిగితే ఆయన ఓ విచిత్రమైన వాదన వినిపించారు. దొంగతనంపై ఇంత వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. వాళ్లే సెటిల్మెంట్ చేసుకుంటారని చెప్పారు. మరి అలాంటప్పుడు ఐరన్‌తో ఉన్న ఆ వాహనాన్ని వారం రోజుల పాటు స్టేషన్‌లో ఎందుకు ఉంచారు? ముగ్గురు నిందితుల్ని విచారించి వారి వేలిముద్రలు ఎందుకు తీసుకున్నారు? అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గే ఎలాంటి కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఆ మెటీరియల్, వెహికిల్ దృశ్యాలు తీసుకునేందుకు కూడా పోలీసులు ఎందుకు అనుమతించడం లేదు..?ఆ దొంగలు అధికార పార్టీ ముఠా కావడం వల్లే అరెస్ట్ చేయడం లేదా అని పలువురు నిలదీస్తున్నారు..

దొంగతనాలను నియంత్రించాల్సిన పోలీసులే ఇలా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. సెటిల్‌మెంట్‌లు చేస్తే ఎలా? ప్రజలకు పోలీసులంటే ఎలా నమ్మకం కలుగుతుంది.? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES