తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్‌ కేసులు.. మార్చి 31 వరకు లాక్‌డౌన్‌..

తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్‌ కేసులు.. మార్చి 31 వరకు లాక్‌డౌన్‌..

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 27కు చేరింది. ఆదివారం ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివ్‌గా తేలిన వారిలో ఒకరు ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివ్‌గా తేలిన వారంతా.. విదేశాల నుంచి వచ్చినవారే. లండన్‌ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌ వచ్చిన 24 ఏళ్ల యువకుడికి, లండన్‌ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌ వచ్చిన కూకట్‌పల్లి చెందిన మరో 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. స్వీడన్ నుంచి హైదరబాద్ వచ్చిన 26 ఏళ్ల విద్యార్ధికి, స్వీడన్‌ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలు చెందిన యువకుడిని పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి వాసి అయిన 34 ఏళ్లవ్యక్తిలోనూ, దుబాయి నుంచి వచ్చిన హైదరాబాద్ చెందిన 50 ఏళ్ల మహిళలోనూ కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్యఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. కలెక్టర్లు, సబ్‌ డివిజన్‌ మెజిస్ట్రేట్లకు విశేష అధికారులు కట్టబెట్టింది. ఎట్టి పరిస్ధితిల్లోనూ ఎవరూ ఇళ్లు దాటి బయటికి రావద్దని, ఐదుగురికి మంచి గుమిగూడవద్దన్నారు సీఎం కేసీఆర్‌. ఈ నిబంధన చాలా సీరియస్‌గా ఉంటుందన్నారు. ఇక .. సరిహద్దుల్లో చెక్కపోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బాసర ధర్మాబాద్‌ వద్ద అంతరాష్ట్ర సరిహద్దు మూసివేశారు.ఇక తెలంగాణ కర్ణాటక సరిహద్దులో జహీరాబాద్‌ చిరాజ్‌పల్లి చెక్క్‌పోస్టునుసైతం మూసివేశారు. మరోవైపు మహరాష్ట్ర వైపు నుంచి వచ్చే వారిని తెలంగాణలోకి అనుమతించడం లేదు.

మరోవైపు.. కరోనా టెస్ట్లు చేసేందుకు ఐదు ప్రైవేట్‌ ల్యాబ్‌లను కేంద్రం అనుమతిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెస్టులు చేస్తే పూణే లేదా ఢిల్లీకి పంపేవాళ్లు. ఈ రిపోర్టుల కోసం 74 గంటల వరకు వేచి చూడాల్సి ఉండేది. అయితే ఇక పై తెలంగాణలోనే టెస్టులు నిర్వహించుకోవాడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags

Next Story