లాక్‌డౌన్‌ విషయంలో ప్రజల తీరుపై మోదీ అసంతృప్తి.. కరోనాను కట్టడి మరో కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ విషయంలో ప్రజల తీరుపై మోదీ అసంతృప్తి.. కరోనాను కట్టడి మరో కీలక నిర్ణయం
X

లాక్‌డౌన్‌ విషయంలో ప్రజల తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఎందుకు విధించారో అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసమే లాక్‌డౌన్‌ ప్రకటించామని, ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్‌పై అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో ముప్పు పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోనివారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ కర్ఫ్యూను చాలా రాష్ట్రాలు పొడిగించాయి. మార్చ్ 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. క్యాబ్‌లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను కూడా ఆపేశారు. కరోనా కట్టడి కావాలంటే స్వీయ నిర్బంధమే సరైన మెడిసిన్ అని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రాకూడదని హెచ్చరించింది. ఐతే, కొన్ని చోట్ల ప్రభుత్వ ఆదేశాలను పట్టించు కోకుండా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఐనప్పటికీ అక్కడక్కడా ప్రజలు ఇంకా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ నిర్లక్ష్యంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలను మరిచిపోవద్దని మోదీ సూచించారు. ఆ మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవాలని చెప్పారు.

ఇక, కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమానాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలను నిలిపివేయ నున్నారు. అలాగే కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా కలిగే నష్టాన్ని కేంద్రం అంచనా వేస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి త్వరలోనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని భావిస్తోంది.

Tags

Next Story