కరోనా మాయ.. గ్లోబల్ కాన్సెప్ట్ ప్లేస్‌లో లోకల్ కాన్సెప్ట్‌

కరోనా మాయ.. గ్లోబల్ కాన్సెప్ట్ ప్లేస్‌లో లోకల్ కాన్సెప్ట్‌

కరోనా దెబ్బకు ప్రపంచ పరిణామమే మారిపోయింది. గ్లోబల్ కాన్సెప్ట్ ప్లేస్‌లో లోకల్ కాన్సెప్ట్‌ ఏర్పడింది. ప్రపంచం మీ గుప్పిట్లో అనే పరిస్థితి పోయి నా దేశం నా ఇల్లు అనే పరిస్థితి వచ్చింది. పి-5 దేశా లుగా పేరొందిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు తమ చుట్టూ తాము గిరిగీసుకున్నాయి. ఇతర దేశాలతో సంబంధాలను తాత్కాలికంగా తెంచేసుకున్నాయి. గత నెల వరకు రారమ్మంటూ ఆహ్వా నించిన దేశాలే, ఇప్పుడు వద్దంటే వద్దంటున్నాయి. ఒకప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం కోసం పాకులాడిన యూరోపియన్ కంట్రీస్ కూడా తమ భద్రత తాము చూసుకుంటున్నాయి. ఇటలీ, స్పెయిన్, జర్మ నీ, నెదర్లాండ్స్ తదితర ఐరోపా దేశాలు కంప్లీట్‌గా లాక్‌డౌన్ ప్రకటించాయి. కొన్ని వారాలుగా ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదంతా కరోనా మహమ్మారి మాయ. ఎవ్వరిని ఎప్పుడు ఎలా కాటేస్తుందో అర్థం గాక అన్ని దేశాలు గడగడా వణికిపోతున్నాయి.

బ్రిటన్‌లో ఆర్థికమంత్రికి కరోనా సోకింది. చాలా మంది ఎంపీలకూ వ్యాధి సంక్రమించింది. దాంతో వాళ్లంతా క్వారంటైన్ అయ్యారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-2ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ కూడా కరోనా కాటుకు గురయ్యారు. ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. జర్మనీలో 25వేల మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, దేశంలో ఇప్పటివరకు దాదాపు వంద మరణాలు సంభవించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కెనెడా ప్రధాని భార్యకు కరోనా సోకింది. ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఫ్రాన్స్‌లో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కరో నా బారిన పడ్డారు. వాళ్లు కూడా క్వారంటైన్లలో చేరారు.

అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో వంద మంది మృతి చెందారు. అక్కడ మృతుల సంఖ్య 420కి పెరిగింది. బాధితుల సంఖ్య 34 వేలకు చేరుకుంది. చైనా, ఇటలీ తర్వాత అమెరికాలోనే వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కరోనా తీవ్రత అనూహ్యంగా పెరగడంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంటికే పరిమితమయ్యారు. , వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్‌కే మద్ధతుగా నిలిచారు. ఇదిలా ఉంటే, చైనాపై ట్రంప్ మరోసారి ఫైరయ్యారు. కరోనా వైరస్‌పై చైనా నుంచి సరైన సమయంలో సరైన సమాచారం రాలేదని మండిపడ్డారు. వైరస్ బయపడిన తొలిరోజుల్లోనే సమగ్ర వివరాలు అందచేసి ఉంటే ఇప్పుడు జరుగుతున్నంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు.

ఇటలీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐతే, శనివారంతో పోలిస్తే ఆదివారం నాడు మరణాల సంఖ్య తక్కువగా నమోదైంది. ఇది కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశం. మొత్తంగా ఇటలీలో 5, 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో 562 మంది మరణించగా, పారిస్ ఆసుపత్రిలో ఎమ ర్జెన్సీ విభాగం వైద్యుడు ఒకరు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. బ్రిటన్‌లో 15 లక్షల మందికి కరోనా ముప్పు ఏర్పడింది. దాంతో వారందరి నీ మూడు నెలల పాటు బయటికి రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. స్పెయిన్‌లో ఆదివారం ఒక్క రోజే 394 మంది మరణించారు. ఆదేశంలో మృతుల సంఖ్య 1750కి పెరిగింది. ఫ్రాన్స్‌లోని ఓయిస్‌ డిపార్ట్‌మెంట్‌లో కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ప్రభుత్వం సరైన మాస్క్‌లు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి

చైనాలో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా ఆరుగురుప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆదేశంలో మృతుల సంఖ్య 3261కి చేరుకుంది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించిన 340 మందిని అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కొత్తగా నమోదైన 119 కేసులతో కలిపి సౌదీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 511కి చేరింది. సౌదీ రాజు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story