ఈఎంఐలు వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు

కరోనా వైరస్ దెబ్బకి దేశం విలవిలలాడుతోంది. ఇప్పటికే సగానికిపైగా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈనెల 31వరకు ఈ నిర్బంధం కొనసాగనుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఉపాధి కోల్పోయిన మధ్య తరగతి వేతన జీవులపై.. ఈ నిర్ణయం మరో పెద్ద పిడుగుపడినట్టు అయింది. లాక్‌డౌన్‌తో వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డడంతో.. కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇవన్నీ నెలసరి వేతన జీవులపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. బ్యాంకు రుణాలు, ఈఎంఐలు కట్టుకునే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ సంక్షోభ నుంచి గట్టెక్కేది ఎలా అని తీవ్ర మథనపడిపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి తాము బయటపడాలంటే బ్యాంకుల నుంచి కొంచెం వెసులుబాటు కావాలని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. 6 నెలలపాటు ఈఎంఐలపై మారటోరియం విధించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. 'జనతా కర్ఫ్యూ EMI పోస్ట్‌పోన్‌మెంట్' డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారులు అని లేదు.. ఏ వర్గం కోలుకోవాలన్నా కనీసం ఆరు నెలలు పడుతుందని మళ్లీ సామాన్యుడి బడ్జెట్ గాడిలో పడే వరకూ ఈఎంఐల బాధ నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు.
కరోనా ప్రభావం వల్ల షట్‌డౌన్ అయిన కంపెనీలకు ఇప్పుడు ఆదాయం లేదు. అదే టైమ్‌లో సామాన్యుడికీ సంపాదన లేదు. వేతన జీవులే కాదు బిజినెస్ వర్గాలు కూడా నెల వారీ బడ్జెట్ లెక్కలు తారుమారు అవడంతో రేపు ఒకటో తేదీన క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టాలన్నా కిందా మీదా పడాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్‌లో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టాలంటే ఎలాగనేది ప్రశ్న. అందుకే 6 నెలలు EMIలు వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ, RBI ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com