దేశీయ మార్కెట్లలో ఘోర పతనం..ఒక్కరోజే కరిగిపోయిన 11 లక్షల కోట్ల సంపద

దేశీయ మార్కెట్లలో ఘోర పతనం..ఒక్కరోజే కరిగిపోయిన 11 లక్షల కోట్ల సంపద

దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనమయ్యాయి. కరోనా వైరస్ దెబ్బ మార్కెట్లపై మళ్లీ పడింది. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 3, 934 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ 27 వేల బెంచ్ మార్క్ దిగువకు పడిపోగా నిఫ్టీ 8 వేల బెంచ్‌ మార్క్‌ను కోల్పోయింది. సెషన్ ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఈ పతనాన్ని చూస్తే ఇవాళ ట్రేడింగ్‌ను పూర్తిగా ఆపేస్తారేమో అనిపించింది. ఓ దశలో 10 శాతానికి పైగా పడిపోవడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. ట్రేడింగ్ పున:ప్రారంభం తర్వాత కూడా మార్కెట్లు మళ్లీ పతనమయ్యాయి. మిడిల్ సెషన్‌లో మార్కెట్లు కాస్త కోలుకున్నట్లు కనిపించినా కాసేపటికే పరిస్థితి మరింత దిగజారింది. నష్టాలు అంతకంతకూ పెరిగిపోయి మార్కెట్లు కుదేలయ్యాయి.

వైరస్ ముప్పు ఇన్వెస్టర్ల సంపదను హారతికర్పూరం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే 11 లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోయింది. మార్కెట్‌ చరిత్రలో ఇంత నష్టం సంభవించడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌ 3 వేలకు పైగా పాయింట్లు కోల్పోవడం రెండోసారి. ఇక, మార్కెట్‌లో ట్రేడింగ్ నిలిపివేయడం గత 7 సెషన్లలో ఇది రెండోసారి. గత వారం కూడా మార్కెట్ లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. కరోనా భయంతో మదుపరులు తమ వాటాలను తెగనమ్ముకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడం, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పరిణామాలు దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా అమ్మకాలు పెరిగి మార్కెట్లు బేర్‌మన్నాయి. కొనుగోళ్లు కళ కోల్పోయి మార్కెట్లు కళావిహీనంగా మారిపోయాయి.

కరోనా ఎఫెక్ట్ ఎంత కాలం కొనసాగుతుందో అనే భయం ఇన్వెస్టర్లను అతలాకుతలం చేస్తోంది. చమురు ధర లు తగ్గడం పెట్టుబడిదారుల కలవరాన్ని ఇంకాస్త పెంచింది. షేర్లను ఉంచుకోవడానికి కంటే కూడా అయినకాడికి అమ్ముకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బ్యాంకింగ్ సహా అన్ని విభాగాల షేర్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ, హీరో మోటో కార్ప్ తదితర సంస్థలు భారీగా న‌ష్టపోయాయి.

Tags

Next Story