అడుగడుగునా.. మానవత్వం చాటుకుంటున్న పోలీసులు

అడుగడుగునా.. మానవత్వం చాటుకుంటున్న పోలీసులు
X

కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రజలకు పోలీసులు అడుగడుగునా చేయూత అందిస్తున్నారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో ఓ గర్భిణికి సాయం అందించారు. జ్యోతి అనే గర్భిణికి పురిటినొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేశారు. అయితే, 108 సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో వందకు డయల్ చేశారు. దీంతో రెబ్బెన పోలీసులు వెంటనే స్పందించారు. స్థానిక ఎస్.ఐ ధీకొండ రమేష్ మానవత్వం చాటుకున్నారు. పోలీసు వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లాక్ డౌన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో.. యాచకులు, మతిస్థిమితం లేని వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అన్నీ బంద్ కావడంతో తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. దీనిని గమనించిన స్థానిక ఎస్.ఐ. తన ఇంటిలోనే వంట చేయించి.. వారికి స్వయంగా వడ్డించారు. అంతేకాదు, మాస్కులు కూడా పంపిణీ చేశారు.

ఇక, సోషల్ మీడియాలో వచ్చిన ఓ వార్తతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెంటనే స్పందించారు. తినడానికి తిండిలేక అలమటిస్తున్నవారిని పెద్ద మనసుతో ఆదుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ లో యూపీకి చెందిన 10 కుటుంబాలు నివాసం వుంటున్నాయి. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వీరంతా ఐస్ క్రీములు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లి గవ్వ లేక ఆకలితో అలమటించారు. వీరి అవస్థను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వార్త కాస్తా ఎస్పీ రాహుల్ హెగ్డే దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన.. అభాగ్యులకు ఆహారాన్ని అందించారు. అంతేకాదు, నిత్యావసర సరుకులను కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

దాతృత్వాన్ని చాటుకోవడమే కాదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే తాటతీస్తున్నారు పోలీసులు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చేవారికి.. కఠిన శిక్షలతో పాటు వెరైటీ శిక్షణలతో బుద్ధిచెబుతున్నారు. కరీంనగ్ జిల్లా ధర్మపురిలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోకిరీలను గుంజీలు తీయించారు ఎస్సై శ్రీకాంత్. లాఠీలతో కొట్టకుండా పాతకాలపు శిక్షలు అమలు చేశారు.

మరోవైపు నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారికి పుష్పగుచ్చాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు స్థానిక నాయకులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లు.. వాహనదారులకు పలు సూచనలు చేశారు.

Next Story