ప్రముఖ జానపద గాయకురాలు మునియమ్మ ఇకలేరు

ప్రఖ్యాత జానపద గాయని, నటి పరవై మునియమ్మ (83) వయసు సంబంధిత వ్యాధుల కారణంగా ఆదివారం (మార్చి 29) తెల్లవారుజామున మరణించారు. ఆమె మదురైలోని తన నివాసంలో కన్నుమూశారు. మునియమ్మకు ఒక కొడుకు ఉన్నాడు.. తన తల్లి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం మదురైలో జరుగుతాయని ఆయన తెలిపారు. 2003లో విక్రమ్ నటించిన 'దూళ్' చిత్రంతో పరిచయమయ్యారు మునియమ్మ. ఈ చిత్రలో ‘సింగం పోల’ అనే పాటతో ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించారు. దూళ్ సినిమాతో పాటు తోరనై కోవిల్, మాన్ కరాటే, వీరమ్ తదితర తమిళ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.
మదురైలోని పరవై అనే గ్రామానికి చెందిన మునియమ్మ జానపద పాటలకు ప్రసిద్ది. ఆలయ కార్యక్రమాలలో ప్రదర్శన ఇవ్వడం ద్వారా గాయకురాలిగా తన వృత్తిని ప్రారంభించిన ఆమె చివరికి లక్ష్మణ శ్రుతి అనే లైట్ మ్యూజిక్ బృందం ఆధ్వర్యంలో స్థానిక మరియు అంతర్జాతీయ కచేరీలు చేశారు. ఆమె స్వరకర్త విద్యాసాగర్ తో ప్లేబ్యాక్ గానం ప్రారంభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మకు గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూ.6 లక్షలు అందజేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రతి నెల ఆరు వేల రూపాయలను భృతిగా అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మరణించడంతో పలువురు గాయకులు నివాళులు అర్పించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com