నిండు గర్భిణీ.. అయినా ఆరువారాల్లో..

ఆమె ఒట్టి మనిషి కూడా కాదు. తన కడుపులో ఓ బిడ్డను మోస్తోంది. అయినా పని పట్ల నిబద్దత. దేశానికి, దేశ ప్రజలకు తన వంతు కర్తవ్యంగా ఏదో ఒకటి చేయాలి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారతదేశాన్ని కబళించి జనాన్ని కకావికలం చేస్తుందని తెలుసుకుని డ్యూటీలో జాయినైపోయింది. పుణెకు చెందిన మీనల్ దఖావే భొసాలే మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ కంపెనీలో వైరాలిజిస్ట్‌గా పనిచేస్తోంది. కరానా ఉందో లేదో గుర్తించే కిట్‌ను రూపొందించే విషయంలో ఆమె భాగం పంచుకున్నారు. నాలుగు నెలలు పట్టే ఆ కిట్ రూపకల్పనను 6 వారాల్లో పూర్తి చేసి దేశానికి అందించారు. మరి కొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనిస్తానని తెలిసినా ల్యాబ్‌లోనే ఎక్కువగంటలు గడిపి కిట్‌ను అతి తక్కువ సమయంలోనే మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఈ నెల 18న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశీలన కోసం కిట్‌ను పంపారు. ఆ మరునాడే ఆమె పండంటి పాపయికి జన్మనిచ్చింది. అన్ని అనుమతులు లభించడంతో మైల్యాబ్స్‌కు చెందిన కరోనా కిట్ గురువారం (మార్చి 26న) మార్కెట్‌లోకి వచ్చింది. దీంతో ఆమె ఆనందం అంబరాన్ని తాకింది. ఇప్పటి వరకు ఈ కరోనా టెస్టింగ్ కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందుకు ఒక్కో కిట్‌కు 4500 ఖర్చవుతోంది. అయిత మైల్యాబ్స్ రూపొందించిన కిట్ రూ.1200లకే లభ్యమవుతుండడం విశేషం. ఒక్కో కిట్ 100 నమూనాలను పరీక్షించగలదు. ఈ కిట్ రెండున్నర గంటలలో రోగ నిర్ధారణ చేస్తుందని పరిశోధన మరియు అభివృద్ధి చీఫ్ వైరాలజిస్ట్ మినల్ దఖవే భోసలే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి 10 మంది బృందం కష్టపడింది. దాంతో తాము అనుకున్న గడువులోనే కిట్‌ను రూపొందించగలిగామని మైల్యాబ్స్ బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com